Kerala: విమానంలో కేరళ సీఎంకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నుంచి నిరసన సెగ.. వీడియో ఇదిగో
- సీఎంపై తీవ్ర ఆరోపణలు చేసిన బంగారం స్మగ్లింగ్ కేసు ప్రధాన నిందితురాలు
- రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపిన విపక్షాలు
- విమానంలో నిరసన తెలిపిన వారిని అడ్డుకున్న ఎల్డీఎఫ్ కార్యదర్శి జయరాజన్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు నిన్న విమానంలో నిరసన సెగ ఎదురైంది. బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన స్వప్న సురేశ్ తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పలు సంఘ వ్యతిరేక, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో వారి ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు నిన్న వీధుల్లోకి వచ్చి సీఎంకు వ్యతిరేకంగా నల్ల జెండాలతో నిరసన తెలిపాయి. టియర్ గ్యాస్, వాటర్ కేనన్లతో పోలీసులు ఈ నిరసనలను అణచివేశారు.
ఇదిలావుంచితే, నిన్న సాయంత్రం కన్నూరు నుంచి తిరువనంతపురం వెళ్లేందుకు విమానమెక్కిన పినరయికి అందులోనూ నిరసన సెగ ఎదురైంది. ఇద్దరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు విమానంలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. వారిలో ఒకరు నల్ల చొక్కా ధరించారు. వెంటనే అప్రమత్తమైన ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ వారిని అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఆ తర్వాత వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.