Gurunaidu Sanapathi: యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఏపీ కుర్రాడు గురునాయుడికి స్వర్ణం
- విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలానికి చెందిన గురునాయుడు
- మెక్సికోలో జరుగుతున్న యూత్ వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 230 కేజీలు ఎత్తిన వైనం
- ఈ పోటీల్లో తొలి స్వర్ణం అందుకున్న భారత లిఫ్టర్‌గా రికార్డు
మెక్సికోలోని లెయాన్‌లో జరుగుతున్న ఐడబ్ల్యూఎఫ్ యూత్ వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లిమర్ల మండలం చంద్రంపేటకు చెందిన సనపతి గురునాయుడు స్వర్ణ పతకం సాధించి యూత్ వరల్డ్ చాంపియన్‌గా అవతరించాడు. 16 ఏళ్ల గురునాయుడు ఆదివారం పొద్దుపోయాక జరిగిన 55 కేజీల విభాగంలో మొత్తం 230 కేజీలు (స్నాచ్‌లో 104 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 126 కేజీలు) ఎత్తి సత్తా చాటాడు. ఈ టోర్నీలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత లిఫ్టర్‌గానూ రికార్డులకెక్కాడు. కాగా, 2020 ఆసియన్ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లోనూ రాణించిన గురునాయుడు కాంస్య పతకం సాధించాడు.
ఇక, 45 కేజీల బాలికల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సౌమ్య ఎస్. దాల్వి కాంస్య పతకం సాధించింది. ఖేలో ఇండియా యూత్ పోటీల్లో రెండుసార్లు స్వర్ణం సాధించిన సౌమ్య మొత్తం 148 కేజీలు (65 ప్లస్ 83 కేజీలు) ఎత్తి కాంస్యాన్ని కైవసం చేసుకుంది. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన భవాని (132 కేజీలు) ఎనిమిదో స్థానంలో నిలిచి నిరాశ పరిచింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు నాలుగు పతకాలు కైవసం చేసుకుంది. పోటీల తొలి రోజు ఆకాంశ కిషోర్, విజయ్ ప్రజాపతి రజత పతకాలు సాధించారు.