Total Energies: గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారంలో అదానీ గ్రూపు కీలక ఒప్పందం
- ఫ్రాన్స్ టోటల్ ఎనర్జీస్ తో భాగస్వామ్యంపై అదానీ గ్రూపు సంతకాలు
- ఏఎన్ఐఎల్ లో టోటల్ ఎనర్జీస్ కు 25 శాతం వాటా
- జాయింట్ వెంచర్ విధానంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి
కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, వాటిని విస్తరించడంలో దూకుడుగా ఉండే అదానీ గ్రూపు మరో కీలక ముందడుగు వేసింది. గ్రీన్ హైడ్రోజన్ వ్యాపారం కోసం ఫ్రాన్స్ కు చెందిన టోటల్ ఎనర్జీస్ తో కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో అదానీ ఎంటర్ ప్రైజెస్ అనుబంధ సంస్థ అయిన అదానీ న్యూ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఏఎన్ఐఎల్)లో టోటల్ ఎనర్జీస్ 25 శాతం వాటా తీసుకోనుంది. ఈ రెండు సంస్థలు కలసి జాయింట్ వెంచర్ విధానంలో గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయనున్నాయి.
భవిష్యత్తు ఇంధనంగా గ్రీన్ హైడ్రోజన్ ను ప్రపంచం పరిగణిస్తుండడం తెలిసిందే. పర్యావరణ అనుకూలమైన ఈ ఇంధనం ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు సైతం పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూపు, ఎల్ అండ్ టీ గ్రూపు గ్రీన్ హైడ్రోజన్ దిశగా భారీ వ్యాపార ప్రణాళికలతో ఉన్నాయి.
అదానీ న్యూ ఇండస్ట్రీస్, టోటల్ ఎనర్జీస్ సంయుక్తంగా గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయనున్నట్టు నేడు ప్రకటన చేశాయి. అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ, టోటల్ ఎనర్జీస్ చైర్మన్, సీఈవో ప్యాట్రిక్ పొయాన్నే ఒప్పందంపై సంతకాలు చేశారు.
‘‘ప్రపంచంలో అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ సంస్థగా అవతరించాలన్న మా ప్రయాణానికి టోటల్ ఎనర్జీస్ తో భాగస్వామ్యం ఎన్నో సానుకూలతలు తెచ్చి పెడుతుంది. పరిశోధన, అభివృద్ధి, మార్కెట్ ను చేరుకోవడం, వినియోగదారు అవసరాలను తెలుసుకోవడానికి సాయపడుతుంది. మార్కెట్ డిమాండ్ రూపాన్నే ఇది మార్చేస్తుంది’’ అని గౌతమ్ అదానీ పేర్కొన్నారు.
ఏఎన్ఐఎల్ లోకి టోటల్ ఎనర్జీస్ ప్రవేశిస్తుండడాన్ని కీలక మైలురాయిగా సంస్థ చైర్మన్ ప్యాట్రిక్ పొయాన్నే పేర్కొన్నారు. ‘‘2050 నాటికి కర్బన ఉద్గార రహిత ఇంధనాల వాటాను మొత్తం మా ఇంధనాల్లో 25 శాతానికి చేర్చాలన్న ప్రణాళికలో ఇది కీలక ముందడుగు’’ అని ఆయన చెప్పారు.