TDP: మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా
- టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీలో నారాయణ అరెస్ట్
- చిత్తూరు కోర్టులో హాజరు పరచిన పోలీసులు
- నారాయణకు జ్యూడిషియల్ రిమాండే అక్కర్లేదన్న న్యాయమూర్తి
- అప్పటికప్పుడే బెయిల్ మంజూరు చేసిన వైనం
- ఆ బెయిల్‌ను రద్దు చేయాలంటూ చిత్తూరు కోర్టులో పోలీసుల పిటిషన్
- ఈ పిటిషన్‌పై విచారణ ఈ నెల 24కు వాయిదా
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలన్న పిటిషన్‌పై విచారణను చిత్తూరు కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో హైదరాబాద్‌లో నారాయణను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరుపరచిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నారాయణకు జ్యూడిషియల్ రిమాండే అక్కర్లేదని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి అప్పటికప్పుడే బెయిల్ మంజూరు చేశారు. దీంతో జైలుకు వెళ్లకుండానే నారాయణ బెయిల్‌పై విడుదలయ్యారు.
ఆ తర్వాత నారాయణకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ పోలీసులు చిత్తూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇప్పటికే ఓ దఫా విచారణ సాగగా... తాజాగా మంగళవారం కూడా దీనిపై చిత్తూరు కోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పోలీసులతో పాటు నారాయణ తరఫు వాదనలను విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది.