Amalapuram: అమలాపురం అల్లర్ల కేసు.. మంత్రి విశ్వరూప్ అనుచరులపై కేసు నమోదు చేసిన పోలీసులు
- ఇప్పటి వరకు 258 మంది నిందితుల గుర్తింపు
- 116 మంది కోసం గాలిస్తున్న పోలీసులు
- అందరిపై రౌడీ షీట్లు తెరుస్తామన్న పోలీసులు
కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అల్లర్లకు దారి తీసిన సంగతి తెలిసిందే. అమలాపురంలో తీవ్ర హింస చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీశ్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇప్పటికే అనేక మందిపై కేసులు నమోదు చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో సత్యరుషి, సుభాష్, మురళీకృష్ణ, రఘు ఉన్నారు.
సత్యరుషిని ఏ 225గా, సుభాష్ ను ఏ 226గా, మురళీకృష్ణను ఏ 227గా, రఘును ఏ 228గా పోలీసులు చేర్చారు. అయితే ప్రస్తుతం వీరు నలుగురు అజ్ఞాతంలో ఉన్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశామని చెప్పారు. 258 మంది నిందితులను గుర్తించామని, వారిలో 142 మందిని అరెస్ట్ చేశామని, మిగిలిన 116 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. వీరందరిపై రౌడీ షీట్లను తెరుస్తామని చెప్పారు. ఈ నిందితులంతా అమలాపురంలో జరిగిన నష్టానికి రెండింతలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.