Post Covid: కరోనా నుంచి కోలుకున్న వారిలో మానసిక సమస్యలు.. పరిష్కారాలు
- కోలుకున్న తర్వాత కొన్ని నెలల్లో కనిపిస్తున్న సమస్యలు
- తీవ్రతను బట్టి సమస్య కాలవ్యవధి
- వైద్యులను సంప్రదించడమే సరైన పరిష్కారం
కరోనా వైరస్ ఊపిరితిత్తులపైనే కాదు.. గుండె, కాలేయం, మూత్రపిండాలు తదితర ఎన్నో అవయవాలపైనా ప్రభావం చూపిస్తోందని విన్నాం. ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారిలో మానసిక సమస్యలు సైతం పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఐసీయూల్లో చేరి చికిత్స తీసుకున్నవారు, మహిళల్లో ఈ మానసిక సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు చెబుతున్నారు.
ఆందోళన, మానసిక వ్యాకులత, ఒత్తిడి తదితర రూపాల్లో సమస్యలు కనిపిస్తున్నాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాలుగు నెలల్లోపు ఇవి బయటపడుతున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. సమస్యలను బట్టి ఎంత కాలం పాటు ఇవి కొనసాగుతాయన్నది ఆధారపడి ఉంటోంది. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల పాటు ఇవి ఉండొచ్చు.
గుర్తించడం ఎలా..?
ప్రవర్తనలో గుర్తించతగిన మార్పులు కనిపించినా.. అంటే తరచుగా అరవడం, ఏడవడం, చిరాకు పడడం, భావోద్వేగాలకు గురికావడం. నిద్ర సమయంలో మార్పులు. అంటే ఎక్కువ సేపు నిద్రించడం.. లేదంటే తక్కువ సమయం పాటే నిద్ర పోవడం. అలాగే, మంచి నిద్ర లోపించడం. తినే అలవాట్లలో మార్పు కనిపించడం. సన్నిహితులు, కుటుంబ సభ్యులతో కలవడానికి ఆసక్తి లోపించడం. చదువుల్లో కానీ, వృత్తిలో కానీ పనితీరు మందగించడం. వీటిల్లో ఏవైనా కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
చికిత్సలు
జీవనశైలిలో మార్పులను వైద్యులు సూచిస్తారు. రోజువారీగా వ్యాయామాలు చేయడంతోపాటు, పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే యాంటీ డిప్రసెంట్స్, యాంటీ యాంగ్జయిటీ మందులను సిఫారసు చేస్తారు.