Hyderabad: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన... అధికారులను అప్రమత్తం చేసిన జీహెచ్ఎంసీ
- తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
- ఫలితంగా సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
- రానున్న 2, 3 రోజుల్లో నగరంలో భారీ వర్షాలంటూ వాతావరణ శాఖ హెచ్చరిక
- ప్రజలు, అధికారులను అప్రమత్తం చేస్తూ జీహెచ్ఎంసీ ప్రకటన
హైదరాబాద్‌లో రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురియనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఆలస్యమైన నైరుతి రుతుపవనాలు తాజాగా తెలంగాణలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతో సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. తాజాగా రానున్న రెండు, మూడు రోజుల్లో నగరంలో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అప్రమత్తమైంది. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తతతో వ్యవహరించాలని కూడా సూచించింది.