Jubilee Hills Gang Rape: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసు: ఇన్నోవా కారు డ్రైవర్, నిందితుల తల్లిదండ్రులపై కేసుల నమోదు

police registered cases against Innova car driver and accused pareants

  • సాక్ష్యాలను చెరిపేసేందుకు నిందితుల యత్నం
  • అత్యాచారం తర్వాత బాధితురాలి కుటుంబం ఎలా స్పందిస్తుందోనని గమనిస్తూ వచ్చిన వైనం
  • కేసు నమోదయ్యాక తలో దిక్కుకు పారిపోయిన నిందితులు
  • అత్యాచారం విషయం నిందితుల తల్లిదండ్రులకూ తెలిసే ఉంటుందని అనుమానం
  • ఒకటి రెండు రోజుల్లో ఐడెంటిఫికేషన్ పరేడ్

సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో నిందితుల తల్లిదండ్రులపై కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం ప్రకారం మైనర్లపై అత్యాచారం జరిగినప్పుడు ఆ విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. 

ఈ నేపథ్యంలో సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపినట్టు సాక్ష్యాలు సేకరించడంతో ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు కేసులు నమోదు చేశారు. అలాగే, బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఆ తర్వాత ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం చేసినట్టు గుర్తించిన పోలీసులు అందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా సేకరించారు.

బాధితురాలిని తీసుకెళ్లిన ఇన్నోవా కారు పోలీసుల దృష్టిలో పడకుండా ప్రభుత్వ సంస్థ చైర్మన్ కారును డ్రైవర్‌కు అప్పగించారు. అతడు దానిని మొయినాబాద్‌ సమీపంలోని అజీజ్‌నగర్‌లో ఓ వ్యవసాయ క్షేత్రంలో నిలిపి వచ్చేశాడు. ఆ క్షేత్రం ప్రభుత్వ సంస్థ చైర్మన్‌దేనని విచారణలో నిందితులు పోలీసులకు తెలిపారు. కాగా, మైనర్ల విచారణ నిన్నటితో ముగిసింది. కోర్టు అనుమతిస్తే కనుక ఒకటి రెండు రోజుల్లో టెస్ట్ ఐడెంటిఫికేషన్‌ పరేడ్‌ నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు.

మరోవైపు, అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఏం జరుగుతుందన్న దానిపైనా నిందితులు ఓ కన్నేసి ఉంచినట్టు విచారణలో పోలీసులు తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన వెంటనే విషయం తెలిసిన సాదుద్దీన్, మిగతా ఐదుగురు మైనర్లు తలోదిక్కుకు పరారయ్యారు. ఓ నిందితుడు ఊటీలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్లాడు. మరో నిందితుడు నెల్లూరు దర్గాకు వెళ్లగా అక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు. మధ్యవర్తుల ఆధారంగా మరో ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ కేసులో ఎ-5 నిందితుడైన మరో మైనర్ గుల్బర్గా ప్రాంతంలో పోలీసులకు దొరికినట్టు తెలుస్తోంది. 

అత్యాచారం విషయం నిందితుల తల్లిదండ్రులకు కూడా తెలిసే ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత బాధితురాలి తండ్రికి ఫోన్ చేసిన ఓ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కోరారంటూ సోషల్ మీడియా కోడైకూస్తోంది. దీనిపై స్పందించిన పోలీసులు అందులో నిజం లేదని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News