Tarun Chugh: ఆ తర్వాతే ప్రధాని కావాలనే కలలు కనండి: కేసీఆర్ పై తరుణ్ ఛుగ్ విమర్శలు
- జాతీయ రాజకీయాల గురించి కేసీఆర్ పగటి కలలు కంటున్నారన్న తరుణ్ ఛుగ్
- బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రాన్ని విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారంటూ వ్యాఖ్య
- ఎనిమిదేళ్లలో రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమిటంటూ ప్రశ్న
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ ఛుగ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రం గురించి పట్టించుకోవడం మానేసి... జాతీయ రాజకీయాల గురించి కలలు కంటున్నారని ఆయన దుయ్యబట్టారు. అందరూ నిద్రలో కలలు కంటారని... కేసీఆర్ మాత్రం పగటి కలలు కంటున్నారని చెప్పారు. కేసీఆర్ కలలు నెరవేరే అవకాశాలు ఏమాత్రం లేవని అన్నారు.
ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణకు కేసీఆర్ చేసిందేమిటని తరుణ్ ఛుగ్ ప్రశ్నించారు. ఇచ్చిన పాత హామీలనే కేసీఆర్ ఇంతవరకు నెరవేర్చలేదని.. ఇప్పుడు కొత్త హామీలతో ప్రజల ముందుకు ఎలా వెళతారని అన్నారు. టీఆర్ఎస్, బీఆర్ఎస్ లకు భయపడే పార్టీ బీజేపీ కాదని చెప్పారు. బీఆర్ఎస్ పేరుతో రాష్ట్రాన్ని విడిచి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని దుయ్యబట్టారు.
ముందు సీఎంగా బాధ్యతలను నెరవేర్చిన తర్వాత... ప్రధాని కావాలనే కలలు కనాలని కేసీఆర్ కు చురక అంటించారు. తనను ప్రధాని చేయాలని దేశవ్యాప్తంగా తిరిగి మమతా బెనర్జీ, దేవెగౌడ, అఖిలేశ్ యాదవ్, కేజ్రీవాల్, స్టాలిన్ తదితరులను కలిశారని.. కానీ ఆయనకు ఏ ఒక్కరు కూడా మద్దతు తెలపలేదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ నెరవేర్చని హామీలపై చర్చకు తాము సిద్ధమని తరుణ్ ఛుగ్ అన్నారు. తమ తరపున బండి సంజయ్ చర్చకు వస్తారని... కేసీఆర్ చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి రాబోయేది బీజేపీనే అని చెప్పారు.