UIDAI: పుట్టిన చిన్నారికి ఆటోమేటిగ్గా తాత్కాలిక ఆధార్..!

UIDAI plans to expand Aadhaar ambit from birth to death
  • ఐదేళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్స్ తో శాశ్వత ఆధార్
  • 18 ఏళ్లు నిండిన తర్వాత అప్ డేషన్
  • ఆధార్ డేటా బేస్ లోకి వెంటనే వ్యక్తుల మరణాలు
  • యూఐడీఏఐ ప్రణాళికలు
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఆధార్ ను ఒక వ్యక్తి పుట్టుక నుంచి, మరణం వరకు అన్నింటికీ అనుసంధానించే ప్రణాళికతో ఉంది. పుట్టిన వెంటనే శిశువుల పేరుతో ఆటోమేటిగ్గా తాత్కాలిక ఆధార్ జారీ అవుతుంది. వారు మేజర్లు అయిన తర్వాత వేలిముద్రలతో అప్ డేట్ చేసుకోవాలి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు త్వరలోనే రెండు పైలట్ కార్యక్రమాలను ఆరంభించనుంది. ఈ వివరాలను యూఐడీఏఐకు చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

2010లో ఆధార్ ఆవిష్కరించిన నాటి నుంచి దేశవ్యాప్తంగా పెద్దలు అందరికీ ఆధార్ జారీ అయింది. ఇక మీదట జన్మించిన దగ్గర్నుంచి, మరణించే వరకు వ్యక్తులకు సంబంధించి అన్ని ముఖ్యమైన వాటికి ఆధార్ ను తప్పనిసరి చేసే యోచనతో యూఐడీఏఐ ఉంది. మరణ రికార్డులతోనూ ఆధార్ డేటాను అనుసంధానించడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు పొందే విషయంలో దుర్వినియోగాన్ని అరికట్టాలన్నది ఉద్దేశ్యం. 

"పిల్లలకు కనీసం ఐదేళ్లు ఉంటేనే వేలిముద్రలు తీసుకుంటారు. ఐదేళ్లు నిండిన పిల్లల ఇంటికి మా బృందాలే వెళ్లి వేలిముద్రలు తీసుకుని శాశ్వత ఆధార్ నంబర్ జారీ చేస్తాయి. 18 ఏళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్స్ మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలి’’ అని ఓ అధికారి తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించి మరణించిన వారి వివరాలు వెంటనే ఆధార్ డేటా బేస్ లోకి చేరేలా యూఐడీఏఐ చర్యలు తీసుకోనుంది. ‘‘ఇటీవల మరణించిన వారి ఆధార్ యాక్టివ్ గా ఉండడంతో వారి పేరిట పెన్షన్ ను ఇంకా ఉపసంహరించకుండా ఆటోమేటిగ్గా జమ అవుతోంది’’ అని సదరు అధికారి తెలిపారు. అలాగే, ఒకే వ్యక్తికి ఒక ఆధార్ మాత్రమే ఉండేలా యూఐడీఏఐ చర్యలు తీసుకోనుంది.
UIDAI
plans
Aadhaar
birth
death

More Telugu News