health tips: వర్షాకాలంలో.. రక్షణ కోసం ఈ నాలుగూ..!

Four early health tips to keep in mind before the arrival of monsoon season

  • నిత్య వ్యాయామంతో ఎన్నో మంచి ఫలితాలు
  • రోగ నిరోధక వ్యవస్థ చురుగ్గా మారుతుంది
  • పోషకాహారంతోపాటు తగినంత నీరు అవసరం
  • రెండు సార్లు స్నానం చేయడం అవసరమే

వర్షాకాలం వచ్చిందంటే ఆరోగ్యపరంగా కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. సీజనల్ ఫ్లూ, పలు రకాల వైరల్ ఫీవర్లు,  ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు దాడి చేస్తాయి. కనుక ఈ కాలంలో వాటిపై పోరాడటానికి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి పలు చర్యలు తీసుకోక తప్పదు. వీటికి సంబంధించి వైద్యుల సూచనలు ఇలా ఉన్నాయి.

రోజువారీ వ్యాయామం
నిత్యం వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి చురుగ్గా మారుతుంది. గుండె వేగంగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరం మొత్తానికి రక్త సరఫరా మంచిగా జరుగుతుంది. సంతోషాన్ని కలిగించే సెరటోనిన్ హార్మోన్ ను శరీరం విడుదల చేస్తుంది. ఇది ఒకవైపు సంతోషాన్నిస్తూనే మరోవైపు రోగ నిరోధక వ్యవస్థపైనా సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాలపై దాడికి రోగ నిరోధక వ్యవస్థ బలంగా తయారవుతుంది. స్కిప్పింగ్, సైకిల్ తొక్కడం, పరుగు, వేగంగా నడవడం, యోగా మంచివి. వారంలో కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయాలి.

పోషకాహారం
ఇన్ఫెక్షన్లకు వర్షాకాలం అనుకూలం. ఈ కాలంలో సూక్ష్మ జీవులు వృద్ధి చెందుతాయి. కనుక వైరల్ ఫీవర్లు, ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. తాజా పండ్లు, కూరగాయలు, ముడి ధాన్యాలు, పప్పు ధాన్యాలు తీసుకోవాలి. పసుపు, అల్లం, వెల్లుల్లి ఈ కాలంలో తీసుకోవడం మరింత మంచిది. నీళ్ల విరేచనాలు అయితే ఓఆర్ఎస్ తీసుకోవాలి.

తగినంత నీరు
తగినంత నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ కు లోను కాకుండా, చర్మంలో నూనె ఉత్పత్తి నియంత్రణలో ఉంటుంది. దాంతో చర్మం మృదువుగా ఉంటుంది. కాఫీ, టీ, సోడాలు డీహైడ్రేషన్ కు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్లం టీ, గ్రీన్ టీ తీసుకోవచ్చు.

రెండు సార్లు స్నానం
ఉదయం ఎలానూ ఒకసారి స్నానం చేస్తాం. అలాగే, స్కూల్/కాలేజీ నుంచి లేదా కర్మాగారం/కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని వైద్యుల సూచన. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, అలర్జీలను నియంత్రించొచ్చు. వాతావరణంలో అధిక తేమ కారణంగా శరీరంపై పేరుకుపోయిన చెమట, మురికిని వదిలించుకోవచ్చు.

  • Loading...

More Telugu News