NDA: మల్లికార్జున ఖర్గేకి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్... ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతివ్వాలని వినతి
- నేడే రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్
- ఎన్డీఏ అభ్యర్థి ఏకగ్రీవ ఎన్నికకు మోదీ, షా వ్యూహాలు
- విపక్షాలను ఒప్పించే బాధ్యతలు రాజ్‌నాథ్, జేపీ నడ్డాలకు
రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. బుధవారం భారత రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేయనుంది. ఈ క్రమంలో తాము ప్రతిపాదించిన అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇటు అధికార ఎన్డీఏతో పాటు అటు తృణమూల్ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు కూడా వ్యూహాలు రచిస్తున్నాయి.
ఇక ఇరు వర్గాల నుంచి ఇప్పటిదాకా అభ్యర్థుల ప్రకటన వెలువడకపోయినప్పటికీ... ఎన్నికను ఏకగ్రీవం చేసుకునేందుకు ఎన్డీఏ రంగంలోకి దిగింది. బుధవారం మధ్యాహ్నం రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. తాము ప్రతిపాదించే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన ఖర్గేను కోరారు.
ఎన్డీఏ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు ఇప్పటికే వ్యూహ రచన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా... విపక్షాలను ఒప్పించే బాధ్యతలను రక్షణ శాఖ మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాకు అప్పగించారు. ఈ క్రమంలో ఇప్పటికే రంగంలోకి దిగిపోయిన రాజ్‌నాథ్, నడ్డాలు విపక్షాలకు చెందిన కీలక నేతలతో చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం ఖర్గేకు రాజ్‌నాథ్ ఫోన్ చేశారు.