Karan Johar: అందరినీ వదిలేసి.. నన్ను మాత్రమే ఎందుకు అంటున్నారు?: కరణ్ జొహార్
- కరోనా బారిన పడ్డ పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు
- కరణ్ జొహార్ పార్టీ వల్లే వైరస్ వ్యాప్తి చెందిందంటూ వార్తలు
- కరోనాను తాను వ్యాప్తి చేయలేదంటూ కరణ్ ఆవేదన
ఇటీవలి కాలంలో పలువురు బాలీవుడ్ స్టార్లు కరోనా బారిన పడ్డారు. షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్ వంటి వారు కూడా కరోనా బారిన పడ్డారని వార్తలు వచ్చాయి. ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జొహార్ ఇచ్చిన బర్త్ డే పార్టీ వల్లే బాలీవుడ్ సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై కరణ్ జొహార్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఇచ్చిన బర్త్ డే పార్టీ వల్లే కరోనా స్ప్రెడ్ అయిందని వార్తలు రావడం బాధాకరమని ఆయన అన్నారు. కరోనా వైరస్ ఎవరికి వచ్చిందో? ఎప్పుడు వచ్చిందో? ఎవరికీ తెలియదని చెప్పారు. తాను పార్టీ ఇచ్చిన ఆ వారంలోనే సినీ పరిశ్రమకు సంబంధించి ఎన్నో పెళ్లిళ్లు, షూటింగులు, ఫంక్షన్లు జరిగాయని... అలాంటప్పుడు తన పార్టీ వల్లే కరోనా వ్యాప్తి చెందిందని ఎలా అంటారని ప్రశ్నించారు. కరోనాను తాను సృష్టించలేదని, తాను వ్యాప్తి చేయలేదని అన్నారు. తనకు సంబంధం లేని విషయం గురించి రాస్తూ... తనను ఎందుకు శిక్షిస్తున్నారని ప్రశ్నించారు.
మే 25న కరణ్ జొహార్ 50వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, రణబీర్ కపూర్, రష్మిక, విజయ్ దేవరకొండ, నీతూ కపూర్, అనన్య పాండే, రాణీ ముఖర్జీ, తమన్నా, పూజా హెగ్డే తదితరులు హాజరయ్యారు.