Andhra Pradesh: 8 ఇళ్లుంటే ఎలా ఇస్తారు?... పింఛన్ నిలిపేశారన్న వృద్ధురాలితో మంత్రి ధర్మాన!
- శ్రీకాకుళంలో గడపగడపకులో పాల్గొన్న మంత్రి ధర్మాన
- 17 ఏళ్లుగా వస్తున్న పింఛన్‌ను నిలిపేశారన్న వృద్ధురాలు
- 8 ఇళ్లు ఉన్న కారణంగానే పింఛన్ నిలిచిందన్న మంత్రి
- ఎలాగైనా పునరుద్దరించాలని వృద్ధురాలి వినతి
- నెలకు రూ.50 వేలు వస్తుంటే పింఛన్ ఎందుకన్న ధర్మాన
వైసీపీ ప్రభుత్వం ఏపీలో నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావుకు బుధవారం ఓ వింత అనుభవం ఎదురైంది. తనకు పింఛన్ రాలేదన్న ఓ వృద్ధురాలి వినతిపై అక్కడికక్కడే వివరాలు తెలుసుకున్న ధర్మాన... 8 ఇళ్లను కలిగిన మీకు పింఛన్ ఎందుకంటూ వృద్ధురాలిని ప్రశ్నించారు.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే... శ్రీకాకుళం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి ధర్మాన బుధవారం నగరంలోని రైతు బజార్ సచివాలయ పరిధిలో జరిగిన గడపగడపకు కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో 24వ వార్డుల్లోకి వెళ్లగానే ఓ వృద్ధురాలు మంత్రి వద్దకు వచ్చారు. 17 ఏళ్లుగా తనకు వస్తున్న వృద్ధాప్య పింఛన్‌ను ప్రస్తుతం అధికారులు నిలిపివేశారని ఆమె మంత్రికి ఫిర్యాదు చేశారు. పక్కనే నగరపాలక సంస్థ కమిషనర్‌ను ఆమె వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి... మీకు 8 ఇళ్లు ఉన్నాయి కదా... అందుకే పింఛన్‌ను నిలిపేశారని తెలిపారు.
మంత్రి వివరణతో వెంటనే స్పందించిన వృద్ధురాలు నాకు 8 ఇళ్లు ఉన్నాయా? అని ప్రశ్నించగానే... అయితే నీ పేరిట ఉన్న ఇళ్లను ప్రభుత్వానికి రాసిచ్చేయండి అంటూ మంత్రి ఛలోక్తి విసిరారు. ఈ సందర్భంగా తనకు ఎలాగైనా పింఛన్ వచ్చేలా చూడండి అంటూ వృద్ధురాలు అడగ్గా... ఇళ్ల అద్దె ద్వారా నెలకు రూ.50 వేలు వస్తున్నాయి కదా ఇక పింఛన్ ఎందుకు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే వృద్ధురాలు తన కాళ్లపై పడినా ధర్మాన పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ సంభాషణ మొత్తం ఆహ్లాదకర వాతావరణంలోనే జరగడం విశేషం.