Enforcement Directorate: రాహుల్ గాంధీ ఈడీ విచారణలో జోక్యం చేసుకోండి: లోక్ సభ స్పీకర్‌కు కాంగ్రెస్ లేఖ
- నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్‌ను విచారిస్తున్న ఈడీ
- విచారణలో రాహుల్‌ను మానసిక వేదనకు గురి చేస్తున్నారన్న చౌదరి
- జోక్యం చేసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో మూడు రోజులుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో జోక్యం చేసుకోవాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కోరుతూ కాంగ్రెస్ పార్టీ బుధవారం ఓ లేఖ రాసింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ ఎంపీ ఆధిర్ రంజన్ చౌదరి స్పీకర్‌కు లేఖ రాశారు.
విచారణలో భాగంగా రాహుల్ గాంధీని ఈడీ అధికారులు మానసిక వేదనకు గురి చేస్తున్నారని, అమానవీయంగా వ్యవహరిస్తున్నారని చౌదరి ఆ లేఖలో పేర్కొన్నారు. ఓ ఎంపీగా రాహుల్ గాంధీ హక్కులను కూడా ఈడీ అధికారులు కాలరాస్తున్నారని స్పీకర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. మూడు రోజుల పాటు రాహుల్‌ను విచారించిన ఈడీ అధికారులు శుక్రవారం కూడా విచారణకు రావాలంటూ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో స్పీకర్‌కు చౌదరి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.