KTR: శ్రీలంక అధికారులు మోదీని టార్గెట్ చేస్తే.. ఎందుకు స్పందించడం లేదు?: కేటీఆర్
- అదానీకి విండ్ పవర్ కాంట్రాక్టుపై మోదీ ఒత్తిడి తెచ్చారన్న శ్రీలంక అధికారి
- మోదీ, అదానీ ఎందుకు స్పందించడం లేదన్న కేటీఆర్
- మీడియా కూడా మౌనంగా ఉందని విమర్శ
శ్రీలంకలో 500 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్ ను ఎలాంటి పోటీ లేకుండానే అదానీ దక్కించుకున్నారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును అదానీ గ్రూప్ కు కట్టబెట్టాలని శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై భారత ప్రధాని మోదీ ఒత్తిడి తీసుకొచ్చారని ఆ దేశ విద్యుత్తు సంస్థ అధ్యక్షుడిగా పని చేసిన ఎంఎంసీ ఫెర్డినాండో ఇటీవల వెల్లడించారు. ఈ అంశం శ్రీలంకలో పెను దుమారమే లేపింది. అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా అక్కడ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మోదీ, గౌతమ్ అదానీలను ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మన దేశంలో ప్రతిపక్ష నేతలను ఈడీ, సీబీఐ, ఐటీ టార్గెట్ చేయడం సాధారణ విషయమేనని... అయితే, పవన విద్యుత్ కాంట్రాక్ట్ లపై శ్రీలంక అధికారులు మోదీని టార్గెట్ చేశారని చెప్పారు. అయినప్పటికీ మోదీ కానీ, అదానీ కానీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో మీడియా కూడా మౌనంగా ఉందని విమర్శించారు.