Microsoft: విండోస్ 7, ఆపై వెర్షన్లు వాడుతున్న వారు అర్జంటుగా అప్ డేట్ చేసుకోవాలంటున్న మైక్రోసాఫ్ట్
- విండోస్ లో ఫోలినా అనే లోపం
- హ్యాకర్ల పాలిట వరం అవుతుందన్న సైబర్ సంస్థ
- సెక్యూరిటీ ప్యాచ్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలన్న మైక్రోసాఫ్ట్
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఓ లోపం ఉన్నట్టు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గుర్తించింది. ఈ లోపం సాయంతో హ్యాకర్లు కంప్యూటర్లలోకి చొరబడి సమాచారాన్ని తస్కరించడం కానీ, మార్పులుచేర్పులు చేసేందుకు కానీ వీలవుతుందని మైక్రోసాఫ్ట్ ఆందోళన చెందుతోంది.
విండోస్ 7, ఆపై వెర్షన్లు ఉపయోగిస్తున్న యూజర్లు వెంటనే తమ సిస్టమ్ ను అప్ డేట్ చేసుకోవాలని హెచ్చరించింది. ఈ మేరకు, సెక్యూరిటీ ప్యాచ్ ను రిలీజ్ చేసింది. వీలైనంత త్వరగా అప్ డేట్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సైబర్ సెక్యూరిటీ సంస్థ బ్లీపింగ్ కంప్యూటర్ తెలిపింది. ఈ లోపాన్ని 'ఫోలినా' అని పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ వర్డ్ వంటి అప్లికేషన్ల సాయంతో హ్యాకర్లు కంప్యూటర్లలోకి చొరబడేందుకు ఫోలినా అనే ఈ లోపం సాయపడుతుందని వివరించింది. తద్వారా హ్యాకర్లు తాము ప్రవేశించిన కంప్యూటర్లలో ఎలాంటి కోడ్ నైనా రన్ చేయగలరని, డేటాను మార్చడం, ప్రోగ్రామ్స్ ఇన్ స్టాల్ చేయడం, డేటాను డిలీట్ చేయడం, కొత్త విండోస్ అకౌంట్లు సృష్టించగలరని పేర్కొంది.