Congress: తెలంగాణ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది: రాహుల్ గాంధీ

congress Backs Basara IIIT Students says Rahul Gandhi

  • మూడో రోజూ కొనసాగిన ఆందోళనలు 
  • కాంగ్రెస్ శక్తిని తక్కువగా అంచనా వేయొద్దని రాహుల్ హితవు
  • ఉద్యమ సమయంలో విద్యార్థులు ఎనలేని పాత్ర పోషించారన్న రాహుల్

క్యాంపస్‌లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మూడు రోజులుగా చేస్తున్న ఆందోళనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల పాత్ర మరువలేనిదని అన్నారు. కేసీఆర్ ఇప్పుడు వారి కృషిని మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. విద్యార్థుల డిమాండ్లను సిల్లీగా పేర్కొనడం సరికాదని హితవు పలికారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల శక్తిని తక్కువగా అంచనా వేస్తోందన్నారు. తెలంగాణ విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు.

12 ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మూడు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులకు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన సీపీఐ నేత నారాయణను, నేతలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు వ్యతిరేకంగా సీపీఐ నేతలు నినాదాలు చేశారు. ట్రిపుల్ ఐటీలోకి ఎస్ఎఫ్ఐ నేతలు దూసుకెళ్లడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మరోవైపు, సీఎం కేసీఆర్ కానీ, మంత్రి కేటీఆర్ కానీ వచ్చి సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని ఆపేది లేదని విద్యార్థులు తెగేసి చెబుతున్నారు.

విద్యార్థుల ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీశ్ కుమార్‌ను ఐటీ డైరెక్టర్‌గా నియమించింది. విద్యార్థుల సమస్యలను తాను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చినప్పటికీ విద్యార్థులు ససేమిరా అంటున్నారు. డైరెక్టర్ నియామకంతో సమస్యలు పరిష్కారం కావని, కేసీఆర్ లేదంటే కేటీఆర్ ఎవరో ఒకరు వచ్చే వరకు ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News