Mohanlal: సబ్బులు అమ్ముకుంటూ జీవిస్తున్న ప్రముఖ నటి లక్ష్మి కూతురు, ఒకప్పటి హీరోయిన్ ఐశ్వర్య!

Mohanlals co star Aishwarya Bhaskaran sells soaps to make ends meet
  •  సినిమాల్లేక ఆర్థిక కష్టాల్లోకి
  • మంచి వేతనం ఇస్తానంటే పాచిపని చేసేందుకు కూడా సిద్ధమన్న నటి
  • ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలంటే తనకో మెగా సీరియల్ అవసరమన్న ఐశ్వర్య
దాదాపు 200 చిత్రాల్లో నటించిన సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్యా భాస్కరన్ ప్రస్తుతం ఇంటింటికి తిరిగి సబ్బులు విక్రయిస్తూ జీవిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన తాను జీవనం కోసం సబ్బులు విక్రయిస్తున్నట్టు చెప్పారు. 

అంతేకాదు, మంచి జీతం ఇస్తానంటే పాచిపని కూడా చేసేందుకు సిద్ధమని చెప్పారు. ప్రస్తుతం చేస్తున్న పనితో సంతోషంగానే ఉన్నానని పేర్కొన్నారు. అప్పులు, ఇతర సమస్యలు అన్నీ తీరిపోయి సంతోషంగా ఉన్నానని పేర్కొన్న ఐశ్వర్య.. తన కాళ్లపై తాను నిలబడి స్వశక్తితో జీవిస్తున్నానని పేర్కొన్నారు. 

తన నలుగురు పిల్లలతో కలిసి ఉంటున్నానని, యోగాను సాధన చేస్తుండడం వల్ల రోజుకు ఒక పూట మాత్రమే ఆహారం తీసుకుంటున్నట్టు చెప్పారు. సీరియల్సే తనకు బతుకునిచ్చాయని, సినిమాలు తనకు అన్నం పెట్టలేదన్నారు. ప్రస్తుత తన ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే తనకు ఒక మెగా టీవీ సీరియల్ కావాలని అన్నారు.

‘న్యాయంగళల్ జయిక్కట్టుం’ సినిమాతో తమిళ తెరకు పరిచయమైన ఐశ్వర్య దాదాపు 200 సినిమాల్లో నటించారు. పలు తెలుగు సినిమాలలో కూడా కథానాయికగా నటించారు. మోహన్‌లాల్‌తో హిట్ సినిమాలైన బటర్‌ఫ్లైస్, నరసింహమ్, ప్రజా వంటి వాటిలో నటించారు. హీరోయిన్‌గా అవకాశాలు కరవైనా చిన్నచిన్న పాత్రలు వేసి మెప్పించారు. 

అలాగే పలు టీవీ సీరియళ్లలోనూ నటించారు. ఆ తర్వాత అవి కూడా లేకపోవడంతో కుటుంబ జీవనానికి సబ్బులు విక్రయిస్తున్నట్టు ఐశ్వర్య స్వయంగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా, 1994లో తన్వీర్ అహ్మద్‌ను పెళ్లి చేసుకున్న ఐశ్వర్య మూడేళ్ల తర్వాత విడాకులిచ్చినట్టు తెలిపారు.
Mohanlal
Aishwarya Bhaskaran
Tollywood
Actress Lakshmi

More Telugu News