Agnipath Scheme: 'వన్ ర్యాంక్ వన్ పెన్షన్' నుంచి 'నో ర్యాంక్ నో పెన్షన్' అంటూ అగ్నిపథ్‌పై కేటీఆర్ ఎద్దేవా
- అగ్నిపథ్ వ్యతిరేక అల్లర్లపై స్పందించిన మంత్రి
- ఈ హింస.. దేశంలో నిరుద్యోగ సంక్షోభానికి నిదర్శనం
- కేంద్రం ఇప్పటికైనా కళ్లు తెరవాలన్న కేటీఆర్
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న హింసాత్మక నిరసనలు దేశంలో నిరుద్యోగ సంక్షోభం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు నిదర్శనం అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ ఆందోళనలు చూసైనా కేంద్రం కళ్లు తెరవాలన్నారు.
తొలుత రైతులతో ఆటలాడుకున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జవాన్లతో ఆడుకుంటోందని విమర్శించారు. సాయుధ బలగాల విషయంలో కేంద్రం తీరు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ నుంచి నో ర్యాంక్ నో పెన్షన్ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు, అల్లర్లు జరుగుతున్నాయి. నిన్నటి వరకు ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితమైన అల్లర్లు తెలంగాణలో కూడా మొదలయ్యాయి. అగ్నిపథ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆర్మీ ఉద్యోగార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి చేస్తున్నారు.