Agnipath Scheme: సికింద్రాబాద్ అల్లర్ల ఎఫెక్ట్.. మెట్రో సర్వీసులు కూడా రద్దు
- అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ స్టేషన్లో ఆందోళన
- పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఇప్పటికే రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసుల రద్దు
- ఇంకా పట్టాలపైనే వందలాది మంది ఆందోళనకారులు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ ఉద్యోగార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో పలు రైళ్లు, ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఉదయం నుంచి సికింద్రాబాద్ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో ముందు జాగ్రత్తగా మెట్రో రైల్ సర్వీసులను కూడా నిలిపి వేస్తున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. తదుపరి సమాచారం ఇచ్చే వరకూ మూడు లైన్లలోని అన్ని మెట్రో రైళ్లను నడపబోమని తెలిపింది.
మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు. పట్టాలపైనే నిరసన కారులు బైఠాయించారు. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేసి, పాత పద్ధతిలోనే ఆర్మీ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులు రైళ్లకు నిప్పు పెట్టి, స్టేషన్ పరిసరాల్లోని ఆస్తులను ధ్వంసం చేశారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. వాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు 11 రౌండ్ల పాటు కాల్పులు జరపగా... ఒకరు చనిపోయారని, పలువురు గాయపడ్డారని తెలుస్తోంది.