CPI Narayana: నిరుద్యోగులను మాయ చేసే దుర్మార్గపు ఆలోచనతోనే అగ్నిపథ్ తీసుకువస్తున్నారు: సీపీఐ నారాయణ

CPI Narayana responds on protests against Agnipath

  • సైన్యంలో స్వల్పకాలిక నియామకాల కోసం అగ్నిపథ్
  • దేశవ్యాప్తంగా భగ్గుమన్న నిరసనలు
  • అనేక రైళ్లకు నిప్పు
  • సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోనూ అదే తీరు!
  • మోదీ ప్రకటనలోనే మోసం ఉందన్న నారాయణ

భారత సాయుధ దళాల్లో నాలుగేళ్ల స్వల్పకాలిక ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం తీసుకువస్తున్న అగ్నిపథ్ విధానం తీవ్ర హింసకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఆందోళనలు భగ్గుమంటున్నాయి. ఆర్మీ ఆశావహులు నిరసనలకు దిగుతూ, పలు రైళ్లకు నిప్పంటించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోనూ ఆందోళనకారులు ఓ రైలును అగ్నికి ఆహుతి చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. 

దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ స్పందించారు. ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మోసపూరితమైనదని విమర్శించారు. నిరుద్యోగులను మభ్యపెట్టే దుష్ట ఆలోచనతోనే అగ్నిపథ్ విధానాన్ని తీసుకువస్తున్నట్టుందని మండిపడ్డారు. 

సైనిక నియామక విధానాన్ని ఇప్పటికిప్పుడు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని నారాయణ ప్రశ్నించారు. నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారని, జరుగుతున్న హింసాత్మక సంఘటనలకు అదే కారణమని స్పష్టం చేశారు. కేంద్రం ఇకనైనా స్పందించి సాయుధ దళాల నియామకాల్లో పాతపద్ధతినే కొనసాగించాలని హితవు పలికారు. 

కాగా, అగ్నిపథ్ పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ, యువతకు ఇది సువర్ణావకాశం అని పేర్కొన్నారు. త్వరలోనే ప్రారంభం అయ్యే అగ్నిపథ్ నియామక ప్రక్రియలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. అటు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సైతం అగ్నిపథ్ కు మద్దతు పలికారు. దేశ సేవ చేయాలనుకునే యువతకు ఇది ప్రయోజనకరం అని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News