Rana Daggubati: మూవీ రివ్యూ: 'విరాటపర్వం'
- ఈ రోజునే విడుదలైన 'విరాటపర్వం'
- యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన కథ
- సాయిపల్లవి అభినయం అద్భుతం
- నక్సలైట్ గా మెప్పించిన రానా
- సహజత్వానికి దగ్గరగా కథను నడిపించిన దర్శకుడు
- అదనపు బలంగా నిలిచిన సంగీతం .. ఫొటోగ్రఫీ
ఈ మధ్య కాలంలో పూర్తి నక్సలిజం నేపథ్యంలో సినిమాలు రాలేదు. ఒకవేళ నక్సలిజం అనే పాయింట్ ను టచ్ చేసినా, అందులో ప్రేమ .. త్యాగం .. పోరాటంతో ముడిపడిన కంటెంట్ తో వచ్చినవి లేవు. ఇక నక్సలిజం నేపథ్యంలో యథార్థ సంఘటనను ఆధారంగా చేసుకుని రూపొందిన సినిమాలు లేవు. అలాంటి ఒక కథాంశంతో నిర్మితమైన సినిమానే 'విరాటపర్వం'. మహాభారతంలో పాండవులు తమ పేర్లు .. వేషధారణ మార్చుకుని ఏడాదికాలం పాటు అజ్ఞాతంగా ఉంటారు .. అదే విరాటపర్వం. నక్సలైట్లు కూడా సమయం కోసం ఎదురుచూస్తూ అడవుల్లో అజ్ఞాతంగా ఉంటారు గనుక ఈ టైటిల్ ను పెట్టారు.
సాయిపల్లవి - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, ప్రియమణి .. జరీనా వాహబ్ .. నందితా దాస్ .. ఈశ్వరీరావు .. నవీన్ చంద్ర .. సాయిచంద్ .. బెనర్జీ .. రాహుల్ రామకృష్ణ .. ముఖ్యమైన పాత్రలలో కనిపించారు. సురేశ్ బాబు .. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు.1990ల లో జరిగిన ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమాతో, ఆయన ప్రయత్నం ఎంతవరకూ ఫలించిందనేది చూద్దాం.
తెలంగాణలోని ఓ మారుమూల గ్రామీణ ప్రాంతంలో .. 1993లో ఈ కథ మొదలవుతుంది. 'ఒగ్గు కథలు' చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే రాములు ( సాయిచంద్) దంపతుల ఏకైక సంతానమే 'వెన్నెల' (సాయిపల్లవి). చిన్నప్పటి నుంచి ఆమెకి పంతం ఎక్కువే. ఏదైనా అనుకున్నదంటే దానిని సాధించవలసిందే. ఒకసారి ఒక నిర్ణయం తీసుకుందంటే వెనకడుగు వేయడం ఆమెకి తెలియదు. అలాంటి వెన్నెల 'అరణ్య' పేరుతో కామ్రేడ్ రవన్న (రానా) రాసే విప్లవ సాహిత్యం చదువుతుంది.
రవన్న ఆలోచనా విధానం .. ఆయన ఆశయం .. ఆయన రచనలు ఆమెను ప్రభావితం చేస్తాయి. దాంతో ఆయన దళంలో చేరాలనీ .. ఆయన పోరాటంలో పాలుపంచుకోవాలని .. ఆయనతో కలిసి బతకాలని నిర్ణయించుకుంటుంది. ఇంట్లో వాళ్లకి ఉత్తరం రాసి పెట్టేసి వెళ్లిపోతుంది. రవన్న దళం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న సమయంలో .. ఆ దళం సభ్యులు ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మార్చేస్తున్న పరిస్థితుల్లో ఆ ఇద్దరి మధ్యలోకి వెన్నెల వెళుతుంది. దాంతో ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? ఆమె ఆశ నెరవేరిందా లేదా? అనేదే కథ.
దర్శకుడు వేణు ఉడుగుల యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టుగా సినిమా చివరలో చెప్పాడు. నిజంగా సినిమా చూస్తున్నంతసేపు మనకళ్ల ముందు ఆ సంఘటనలు జరుగుతున్నట్టుగానే ఉంటుంది. కథను ఎంచుకోవడంలో .. కథనాన్ని నడిపించడంలో .. పాత్రలను మలిచే విధానంలో .. సన్నివేశాలను సహజత్వంతో ఆవిష్కరించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. సాయిపల్లవి కళ్లను .. ఆమె నటనను ఆయన పూర్తిస్థాయిలో వాడుకున్నాడు.
తన తండ్రిని పోలీసులు కొట్టినప్పుడు సాయిపల్లవి వాళ్లను నిలదీసే సీన్ ను .. ఓ డిగ్రీ కాలేజ్ లో రవన్న ఒకడికి స్పాట్ పెడితే .. అదే సమయంలో సాయిపల్లవిపై అనుమానంతో ఆమెను పోలీసులు అక్కడికి తీసుకువచ్చే సీన్ ను .. రవన్న స్థావరానికి ముందు సాయిపల్లవి .. ఆ తరువాత పోలీసులు చేరుకునే సీన్ .. తనని వెతుకుతూ వచ్చిన తండ్రిని సాయిపల్లవి అనుకోకుండా కలుసుకునే సీన్ .. తల్లిని కలవడానికి వెళ్లిన రవన్నను పోలీసులు చుట్టుముట్టే సీన్ ఈ సినిమాలో హైలైట్ గా అనిపిస్తాయి. ఎక్కడా ఏ సీన్ అతికించినట్టుగా .. అనవసరమైనదిగా అనిపించదు.
ఈ కథ అంతా కూడా సాయిపల్లవి చుట్టూనే తిరుగుతుంది. నటన విషయంలో ఆమె ఇంతవరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అని చెప్పచ్చు. వెన్నెల అనే పాత్రలో ఆమె చందమామలా ఒదిగిపోయిందనే చెప్పాలి. ప్రేమ .. ఆనందం .. ఉద్వేగం .. ఉక్రోషం అద్భుతంగా పలికించింది. సాయిపల్లవి లేకపోతే ఈ సినిమా లేదని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రానా అన్నాడు .. ఈ సినిమా చూశాక అది నిజమేనని అనిపిస్తుంది. ఈ సినిమాలో రానా పాత్ర నిడివి తక్కువ అనే టాక్ వచ్చింది కానీ అలాంటిదేం లేదు. తెరపై ఆయన కనిపించకపోయినా ఆ పాత్ర దిశగానే కథ కదులుతూ ఉంటుంది.
ఆ మధ్య రానా అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నప్పుడు షూటింగు జరుపుకున్న సినిమా ఇది. అందువలన రానా కాస్త బలహీనంగానే కనిపించాడు. ఆవేశభరితమైన సన్నివేశాల్లోనే కాదు .. తల్లి రాసిన ఉత్తరాన్ని చదివి కన్నీళ్లు పెట్టుకునే ఎమోషనల్ సీన్ ను కూడా గొప్పగా చేశాడు. ఇలా మిగిలిన వాళ్లంతా పాత్ర పరిధిలో చాలా సహజంగా నటించారు. సురేశ్ బొబ్బిలి సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పాలి. 'ఓ లచ్చాగుమ్మడి' .. 'కోలోయమ్మ కోలోయమ్మ నా సామి' .. ' నిప్పు ఉంది నీరు ఉంది' పాటలు మనసును పట్టుకుంటాయి. కాకపోతే సాయిపల్లవి విప్లవ సాహిత్యం చదువుతున్నప్పుడు, ఆ సాహిత్యం వినిపించకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ డామినేట్ చేసింది.
ఇక ఈ సినిమాకు అదనపు బలంగా ఫొటోగ్రఫీ నిలిచింది. డానీ .. దివాకర్ మణి సన్నివేశాలను అద్భుతంగా ఆవిష్కరించారు. పల్లెటూళ్లు .. అడవులు .. జలపాతాలు .. రెయిన్ ఎఫెక్ట్ సీన్స్ ను గొప్పగా చిత్రీకరించారు. ఇక శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కి వంక బెట్టవలసిన పనిలేదు. కొన్ని డైలాగ్స్ మనసుకి హత్తుకునేలా ఉన్నాయి. 'నీ కోసం పక్షిలా ఎగిరొస్తే రెక్కలు కత్తిరిస్తావా?' .. 'నీ రాతల్లో నేను లేకపోవచ్చనేమో .. కానీ నీ తలరాతలో నేనే ఉన్నాను' .. 'నా చేతిలోని ఉత్తరం నీ చేతిలోని ఆయుధంకంటే బలమైనది ... ఎందుకంటే అది రాసింది అమ్మ కాబట్టి' అనే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
సాధారణంగా నక్సలిజం నేపథ్యం .. వాళ్లు చేసే పోరాటం అనగానే, పూరి గుడిసెలు .. కూలిన గోడల మధ్య సన్నివేశాలు సాగుతాయని అనుకుంటారు. కానీ సహజత్వానికి భంగం కలగకుండా అందంగా .. అద్భుతంగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. సాయిపల్లవి కెరియర్లో ఈ సినిమా కూడా గుర్తుపెట్టుకోదగినది అవుతుందని చెప్పచ్చు. ఈ సినిమాను గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే, ఇది ఒక ప్రేమకథ .. ఒక పోరాటం కథ .. పోరాటాన్ని వెతుక్కుంటూ వెళ్లే ప్రేమకథ. ప్రేమ - పోరాటం రెండూ త్యాగాన్నే ఆవిష్కరిస్తాయని చాటిచెప్పే కథ.
--- పెద్దింటి గోపీకృష్ణ