Secunderabad Railway Station: ఇంకా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లోనే ఆందోళనకారులు... ఆర్మీ నియామక అధికారి తమ వద్దకు రావాలని డిమాండ్
- అగ్నిపథ్ ప్రకటనపై ఆగ్రహజ్వాలలు
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో హింసాత్మక ఘటనలు
- ఓ రైలుకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
- పోలీసుల కాల్పుల్లో ఒకరి మృతి
తాజా సైనిక నియామక విధానం అగ్నిపథ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీ విధ్వంసానికి పాల్పడడం తెలిసిందే. ఈ ఉదయం నుంచి సికింద్రాబాద్ స్టేషన్ తీవ్రస్థాయి ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరపగా, ఓ నిరసనకారుడు మృతి చెందాడు.
కాగా, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఉదయంతో పోల్చితే నిరసనకారుల సంఖ్య కాస్త తగ్గినా, ఇప్పటికీ అక్కడ ఆందోళనకర పరిస్థితి కొనసాగుతోంది. రైల్వే స్టేషన్ లోనే ఉన్న ఆందోళనకారులు తాము చర్చలకు వెళ్లబోమని చెబుతున్నారు. ఆర్మీ ఉద్యోగ నియామక అధికారి తమ వద్దకు రావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళనల నేపథ్యంలో రైలు ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు రైల్వే అధికారులను 040-27786666 నెంబరు ద్వారా సంప్రదించాలని రైల్వే శాఖ పేర్కొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు రైల్వే శాఖ చీఫ్ పబ్లిక్ రిలేషన్ అధికారి (సీపీఆర్వో) వెల్లడించారు. ఆందోళనకారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వివరించారు. స్టేషన్ లో ఆర్పీఎఫ్, జీఆర్పీ, రాష్ట్ర పోలీసు బలగాలను మోహరించినట్టు తెలిపారు. రైల్వే ఆస్తులు ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకుంటామని సీపీఆర్వో స్పష్టం చేశారు.