Indian Railways: రైల్వే ఆస్తులు ధ్వంసం చేయొద్దు: రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజ్ఞప్తి
- అగ్నిపథ్ ప్రకటించిన కేంద్రం
- అగ్నిగుండంలా పలు రాష్ట్రాలు
- బీహార్, తెలంగాణలో రైళ్లకు నిప్పు
- స్పందించిన కేంద్ర రైల్వేశాఖ మంత్రి
సాయుధ దళాల్లో నాలుగేళ్ల కాలావధితో ఉద్యోగ నియామకాల కోసం కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది. ఈ పథకంతో తాము నష్టపోతామని ఆర్మీ ఆశావహులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే ఆస్తులను లక్ష్యంగా చేసుకుని తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. యువత హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొనరాదని, రైల్వే ఆస్తులను ధ్వంసం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
కేంద్రం అగ్నిపథ్ ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలు రాజుకున్నాయి. ఇవాళ బీహార్, తెలంగాణలో రైళ్లను ధ్వంసం చేసిన ఘటనలు నమోదయ్యాయి. బీహార్ లో ఆందోళనకారులు ఇస్లామ్ పూర్, దానాపూర్ రైల్వేస్టేషన్లలో రైళ్లను దగ్ధం చేశారు. రైలు పట్టాలపై సైకిళ్లను, బెంచీలను, బైకులను అడ్డంగా వేశారు. దాంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తెలంగాణలోని సికింద్రాబాద్ లోనూ రైల్వే ఆస్తులు ధ్వంసం చేశారని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా వెల్లడించారు. నాలుగైదు రైళ్ల ఇంజిన్లను, రెండు మూడు బోగీలను అగ్నికి ఆహుతి చేశారని వివరించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని తెలిపారు.