Kempegowda Airport: దక్షిణాసియాలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా బెంగళూరు ఎయిర్ పోర్టు
- కెంపెగౌడ ఎయిర్ పోర్టు ఘనత
- స్కైట్రాక్స్ రీజినల్ ఎయిర్ పోర్టు అవార్డు కైవసం
- బెంగళూరు ఎయిర్ పోర్టుకు ఓటేసిన ప్రయాణికులు
- ఫ్రాన్స్ లో అవార్డుల కార్యక్రమం
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం భారత్ లోనే కాదు, దక్షిణాసియాలోనే అత్యుత్తమంగా నిలిచింది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ పోర్ట్ అవార్డ్స్ లో ఉత్తమ ప్రాంతీయ విమానాశ్రయంగా ఘనత సాధించింది. జూన్ 16న ఫ్రాన్స్ లో జరిగిన పాసింజెర్ టెర్మినల్ ఎక్స్ పో కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ మేరకు బెంగళూరు విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి.
ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించిన విషయం అంతర్జాతీయంగా చేపట్టిన సర్వేలో వెల్లడైందని, అందుకే తమను అవార్డు వరించిందని బెంగళూరు ఎయిర్ పోర్టు సోషల్ మీడియాలో పేర్కొంది. విమానాల రాకపోకల సందర్భంగా నిర్వహించే చెక్-ఇన్ లు, భద్రత, ఇమ్మిగ్రేషన్, షాపింగ్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేశారని వివరించింది. ఈ అవార్డు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. తమకు ఓటేసిన ప్రయాణికులకు బెంగళూరు ఎయిర్ పోర్టు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి.