Pawan Kalyan: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు పవన్ కల్యాణ్ మద్దతు
- డిమాండ్ల సాధన కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పోరుబాట
- కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ క్యాంపస్ కు రావాల్సిందేనని డిమాండ్
- గత కొన్నిరోజులుగా విద్యార్థుల ఆందోళనలు
- ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న పవన్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు 12 డిమాండ్ల సాధన కోసం నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ వీసీ లేకపోవడంతో ప్రమాణాలు పడిపోతున్నాయని, విద్యాసంవత్సరం ప్రారంభమైనా తమకు ల్యాప్ టాప్ లు, యూనిఫాం ఇవ్వడంలేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ తమ క్యాంపస్ కు రావాల్సిందేనని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గత కొన్నిరోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు.
దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఓ ప్రకటనలో కోరారు. బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ట్రిపుల్ ఐటీ)లో విద్యార్థుల సమస్యల పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూల చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. విద్యార్థులు ఆందోళనలు విరమించే దిశగా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ట్రిపుల్ ఐటీలను ఏ లక్ష్యం కోసం స్థాపించారో అది నెరవేరే విధంగా ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని హితవు పలికారు.