Avesh Khan: నా ప్రదర్శన వెనుక ద్రవిడ్ ప్రోత్సాహం ఎంతో ఉంది: అవేశ్ ఖాన్
- మొదటి మూడు మ్యాచుల్లో ఒక్క వికెట్ తీయలేదన్న అవేశ్
- అయినా రాహుల్ సర్ తనకు మద్దతుగా నిలిచినట్టు వెల్లడి
- మరో మ్యాచ్ లో అవకాశం ఇవ్వడంతో సత్తా చాటినట్టు ప్రకటన
ఐపీఎల్ 2022 సీజన్ లో మంచి పనితీరుతో జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న ఆటగాడు అవేశ్ ఖాన్. లక్నో జట్టు సభ్యుడైన ఇతడు.. దక్షిణాఫ్రికాతో భారత్ పోటీపడిన నాలుగో టీ20 మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. 18 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికాతో మొదటి మూడు టీ20 మ్యాచుల్లో రాణించకపోయినా.. అతడిపై నమ్మకంతో కోచ్, కెప్టెన్ అతడ్ని కొనసాగించారు. అందుకు ఫలితం చూపించాడు అవేశ్ ఖాన్.
తన అద్భుత ప్రదర్శన క్రెడిట్ అంతా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కే దక్కుతుందుని అవేశ్ ఖాన్ ప్రకటించడం గమనార్హం. తాను మొదటి మూడు టీ20 మ్యాచుల్లో ఒక్క వికెట్ తీయకపోయినా రాహుల్ సార్ తనకు మద్దతుగా నిలిచినట్టు అవేవ్ ఖాన్ చెప్పాడు.
‘‘నాలుగు మ్యాచుల్లోనూ జట్టును ఏ మాత్రం మార్పు చేయలేదు. కనుక ఈ క్రెడిట్ అంతా రాహుల్ (ద్రవిడ్) సర్ కే చెందుతుంది. ఒకటి రెండు మ్యాచుల్లో చెత్త ప్రదర్శన తర్వాత ఆటగాడిని ఆయన మార్చరు. ఎందుకంటే ఒకటి రెండు గేమ్ లతో ఆటగాడి ప్రతిభను తేల్చడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరూ తాము ఏంటో నిరూపించుకునేందుకు తగినన్ని మ్యాచుల్లో ఆడించాలి.
దక్షిణాఫ్రికాతో మొదటి మూడు పొట్టి మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో నాపై ఒత్తిడి ఉంది. కానీ, రాహుల్ సర్, జట్టు యాజమాన్యం నాకు మరో అవకాశం ఇచ్చింది. దాంతో నాలుగు వికెట్లు తీయగలిగాను. మా నాన్న పుట్టిన రోజు కావడంతో ఆయనకు దీన్ని బహుమతిగా ఇస్తున్నాను’’ అని అవేశ్ ఖాన్ పేర్కొన్నాడు.
నాలుగు వికెట్లు తీయడం వెనుక తన వ్యూహాన్ని అవేశ్ ఖాన్ చెప్పాడు. ‘‘మొదట మేము బ్యాటింగ్ చేస్తే అప్పుడు వికెట్ ఎలా ప్లే అవుతోందని బ్యాట్స్ మ్యాన్ ను అడుగుతా. అలాగే, నేడు (శుక్రవారం) ఇషాన్ కిషన్ ను అడిగాను. హార్డ్ లెంత్ బాల్స్ ఆడేందుకు కష్టంగా ఉందని చెప్పాడు. దాంతో స్టంప్స్ ను లక్ష్యంగా చేసుకున్నాను. హార్డ్ లెంత్ బాల్స్ ను వేశాను’’ అని వివరించాడు.