TRS: టీఆర్ఎస్ ను వీడి.. కాంగ్రెస్ లోకి పీజేఆర్ కూతురు విజయా రెడ్డి
- ఈ నెల 23న కాంగ్రెస్ లో చేరుతానని ప్రకటన
- రేవంత్ రెడ్డితో భేటీ తర్వాత నిర్ణయం
- ఖైరతాబాద్ కార్పొరేటర్ గా ఉన్న విజయారెడ్డి
తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి మాజీ మంత్రి పి. జనార్దన్ రెడ్డి (పీజీఆర్) కూతురు పి. విజయా రెడ్డి షాకిచ్చారు. ఖైరతాబాద్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఎన్నికైన విజయారెడ్డి ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఆమె తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు.
ఈ విషయాన్ని విజయారెడ్డి స్వయంగా వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమైన అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. పీజేఆర్ వారసత్వం కొనసాగించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఈ నెల 23వ తేదీన కాంగ్రెస్ లో చేరుతానని తెలిపారు. తనకిప్పుడు ఇంటిపార్టీలోకి వస్తున్నాననే భావన ఉందని అన్నారు.
పీజేఆర్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన విజయారెడ్డి తర్వాత టీఆర్ఎస్ చేరారు. రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఆశించిన ఆమెకు ఆ అవకాశం రాలేదు. టీఆర్ఎస్ లో తనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని విజయారెడ్డి చాన్నాళ్ల నుంచి అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి.