Agnipath Scheme: అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలపై సిట్ వేయాలంటూ సుప్రీంలో పిటిషన్
- నిరసనల్లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం
- రైల్వేతో పాటు ప్రజా ఆస్తులకు జరిగిన నష్టాలపై విచారించాలని పిటిషన్
- అగ్నిపథ్ వల్ల జాతీయ భద్రతపై ప్రభావాన్ని పరిశీలించేందుకు కమిటీ వేయాలని విన్నపం
దేశ త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశంలో పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. పలు రైళ్లను తగులబెట్టారు.
మరోవైపు అగ్నిపథ్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలను విచారించడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. రైల్వేతో పాటు ప్రజా ఆస్తులకు జరిగిన నష్టాలను విచారించాలని పిటిషన్ లో పిటిషనర్ కోరారు. ఈ పథకం వల్ల జాతీయ భద్రత, సైన్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో పరిశీలించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా కోరారు.