Mallikarjuna Reddy: క్షిపణి సమాచారం కోసం డీఆర్డీఎల్ ఉద్యోగికి వలపు వల విసిరిన పాక్
- హైదరాబాదులో మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి అరెస్ట్
- డీఆర్డీఎల్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న వ్యక్తి
- నటాషా రావు పేరుతో మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్
- ప్రేమ, పెళ్లి పేరుతో కీలక సమాచారం రాబట్టిన మహిళ
భారత సైన్యం రహస్యాలు, దేశ ఆయుధ వ్యవస్థల కీలక సమాచారం కోసం పాకిస్థాన్ హనీ ట్రాప్ లు విసరడం కొత్తేమీ కాదు. భారత రక్షణ రంగ ఉద్యోగులకు అమ్మాయిలను ఎరగా వేసి అనుకున్న లక్ష్యాలను సాధించడం పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి బాగా అలవాటైన విద్య. హైదరాబాదులోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్)కి చెందిన మల్లికార్జున రెడ్డి (29) అనే ఉద్యోగికి పాక్ వలపు వల విసిరింది. ప్రేమ పేరుతో అతడిని ఉచ్చులోకి దింపిన ఐఎస్ఐ మహిళా ఏజెంటు, ఆపై పెళ్లి చేసుకుందామంటూ మరింత నమ్మకం కలిగించింది. ఆపై భారత రక్షణ రంగ సమాచారం సేకరించింది.
మల్లికార్జున రెడ్డి తనకు డీఆర్డీఎల్ లో ఉద్యోగం వచ్చిందంటూ 2018లో ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. ఆ తర్వాత నటాషా రావు అనే పేరుతో ఓ మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. బ్రిటన్ రక్షణ రంగ మ్యాగజైన్ లో తాను ఉద్యోగినని ఆమె పరిచయం చేసుకుంది. తన తండ్రి భారత వాయుసేనలో అధికారి అని పేర్కొంది. తమది బెంగళూరు అని వివరించింది. ఆ మహిళ మాయలో పడిపోయిన మల్లికార్జున రెడ్డి క్షిపణుల అభివృద్ధికి సంబంధించిన సమాచారం, కొన్ని కీలక ఫొటోలను ఆమెకు పంపించాడు. 2021 డిసెంబరు వరకు ఈ తంతు కొనసాగింది.
అయితే, నటాషా తన ఫేస్ బుక్ ప్రొఫైల్ లో పేరును సిమ్రాన్ చోప్రా అని మార్చుకోవడంతో మల్లికార్జున రెడ్డి ఆమెతో చాటింగ్ కు స్వస్తిపలికాడు. అయితే, ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందడంతో రాచకొండ పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టిసారించారు. డీఆర్డీఎల్ లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్న మల్లికార్జున రెడ్డి కీలక సమాచారం లీక్ చేశాడని గుర్తించారు. హైదరాబాదులోని మీర్ పేటలో మల్లికార్జున రెడ్డిని నిన్న అరెస్ట్ చేశారు. కాగా, అతడి బ్యాంకు వివరాలను కూడా నటాషా రావు సేకరించిందని పోలీసులు గుర్తించారు.