5G: ఈ ఏడాది చివరి నాటికి భారత్ లో 5జీ సేవలు
- ఆగస్టు-సెప్టెంబరు నుంచి సన్నాహాలు
- తొలుత 20 నుంచి 25 నగరాల్లో 5జీ సేవలు
- వెల్లడించిన కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్
- భారత్ లో డేటా రేట్లు తక్కువని వెల్లడి
మొబైల్ టెలికాం రంగంలో 4జీ ఓ విప్లవం అనుకుంటే, దాన్ని మించి 5జీ వస్తోంది. భారత్ లోనూ 5జీ సేవలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. భారత్ లో మొదట 20 నుంచి 25 నగరాల్లో 5జీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్ర టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి ఆయా నగరాల్లో 5జీ సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు. అందుకోసం ఆగస్టు, సెప్టెంబరు నుంచి ఏర్పాట్లు షురూ అవుతాయని వివరించారు.
4జీ, 5జీ అభివృద్ధి నేపథ్యంలో, డిజిటల్ నెట్వర్కుల ఏర్పాటులో నమ్మకమైన వనరుగా భారత్ తన స్థానాన్ని మరింత పదిలపరుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ లో అభివృద్ధి చెందుతున్న 4జీ, 5జీ ఉత్పాదనలు, సాంకేతికతల వినియోగానికి అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు.
ప్రపంచ సగటుతో పోల్చితే భారత్ లో డేటా ధరలు గణనీయంగా తక్కువ అని అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. డేటా ధరల ప్రపంచ సగటు 25 డాలర్లు ఉంటే, భారత్ లో అది 2 డాలర్లు మాత్రమేనని తెలిపారు. మిగతా దేశాలతో పోల్చితే భారత్ లో డేటా 10 రెట్లు చవక అని అన్నారు. దేశంలో 5జీ ధరలు ఎలా ఉండబోతున్నాయన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు.
అంతేగాకుండా, కొత్త నెంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు కాలర్ పేరు కూడా ప్రదర్శితమయ్యేలా నిబంధన తీసుకువచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయని మంత్రి వివరించారు.