Fathers Day: నాన్న కోసం ఈ ఆరు టెస్ట్ లు.. హెల్తీ ఫాదర్స్ డే

Happy Fathers Day 6 crucial health tests your Dad over age 50 must take

  • వయసుతోపాటే పలకరిచ్చే ఆరోగ్య సమస్యలు
  • పెరుగుతున్న మధుమేహం, బీపీ, కేన్సర్ రిస్క్ లు
  • కొలెస్ట్రాల్ కూడా పెద్ద రిస్కే
  • ఏడాదికోసారి పరీక్షల ద్వారా ముందే గుర్తించే అవకాశం

నాన్న సేవలను గుర్తు చేసుకునేందుకు ఫాదర్స్ డే పేరుతో ఒక రోజును (జూన్ 19) కేటాయించారు. ఏటా జూన్ మూడో ఆదివారం ఇది వస్తుంది. అమ్మను మించి దైవం లేదని చెప్పుకుంటాం. అమ్మ పాత్ర ఎంతో.. నాన్న పాత్ర కూడా అంతే. కాకపోతే అమ్మ ముందుంటే, నాన్న వెన్ను తట్టేందుకు వెనుక ఉంటాడు. పైకి కనిపించని త్యాగమూర్తి. ప్రత్యక్ష దైవమైన అమ్మానాన్నల ఆరోగ్యం ఎంతో ముఖ్యం. జీవించి ఉన్నంత వరకు మన శ్రేయస్సు, సంతోషం కోసం పాటుపడే వారి ఆరోగ్యం కోసం మనవంతుగా కొంతైనా చేయాలిగా. ముందస్తు వైద్య పరీక్షలతో కొన్నిరకాల వ్యాధులను గుర్తించొచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

బ్లడ్ షుగర్
మధుమేహాన్ని ముందే గుర్తించి, చికిత్స తీసుకోకపోతే ఎంతో చేటు చేసే మహమ్మారి. నాడీ మండల వ్యవస్థ, గుండె, మూత్ర పిండాలను దెబ్బతీస్తుంది. అందుకని 50 ఏళ్లు దాటిన తర్వాత అమ్మా నాన్నలకు తప్పకుండా ప్రతీ మూడు నెలలకు ఒకసారి డయాబెటిస్ స్క్రీన్ చేయించాలి. సాధారణ బ్లడ్ షుగర్ టెస్ట్ తో దీన్ని గుర్తించొచ్చు. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ టెస్ట్ లో బ్లడ్ షుగర్ నార్మల్ అని ఫలితం వచ్చినా ఊరుకోకండి. హెచ్ బీఏ1సీ పరీక్ష చేయించడం ద్వారా వారు మధుమేహం ముందస్తు దశలో ఉన్నారా? అన్నది గుర్తించొచ్చు. తద్వారా ముందు నుంచే వారి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టొచ్చు. అధిక దాహం, గాయాలు త్వరగా మానకపోవడం, చర్మంపై నల్లటి మచ్చలు, బరువు తగ్గడం ఇవన్నీ మధుమేహం లక్షణాలు.

కంటి పరీక్షలు
నేడు ఫోన్లు, కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ కారణంగా స్క్రీన్ పై వెచ్చించే సమయం బాగా పెరిగిపోయింది. దీర్ఘకాలంలో కంటిచూపునకు ఇది హాని చేస్తుంది. రక్తంలో గ్లూకోజు నియంత్రణ లేని సందర్భాల్లో రక్తనాళాలు, నాడీ మండలంపైనా ప్రభావం పడుతుంది. ఫలితంగా డయాబెటిక్ రెటీనోపతి, క్యాటరాక్ట్, గ్లూకోమా, మాక్యులర్ డీజెనరేషన్ సమస్యలు ఏర్పడతాయి. అందుకే ఏడాదికోసారి కంటి పరీక్షలు చేయించాలి.

లిపిడ్ ప్రొఫైల్స్
దీన్నే కొలెస్ట్రాల్ పరీక్షగా చెబుతారు. కొలెస్ట్రాల్ లో వివిధ రకాలు, అవి ఏ పరిమాణంలో ఉన్నాయో చెప్పే పరీక్ష ఇది. 12 గంటల ఫాస్టింగ్ అనంతరం పొద్దున్నే చేయించుకోవాల్సిన పరీక్ష ఇది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్, మంచి కొలెస్ట్రాల్ హెచ్ డీఎల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ట్రైగ్లిజరైడ్స్ ఎంతున్నదీ చెబుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే అది రక్త నాళాల్లో రక్త ప్రవాహానికి అడ్డుపడుతుంది. దాంతో స్ట్రోక్, హార్ట్ ఎటాక్ సమస్యలు ఎదురవుతాయి. కనీసం ఏడాదికోసారి ఈ పరీక్ష చేయించుకోవాలి.

బ్లడ్ ప్రెషర్ (బీపీ)
బీపీ కూడా సైలెంట్ కిల్లరే. గుండె నుంచి శరీర అవయవాలకు రక్తాన్ని పంప్ చేస్తున్న సమయంలో ఉండే ఒత్తిడినే బీపీగా చెబుతారు. ఇది ఎక్కువగా ఉంటే గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంది. కిడ్నీలపైనా ఈ ప్రభావం పడుతుంది. రక్తపోటును మూడు నెలలకోసారి చెక్ చేయించాలి. సాధారణ 110/70 - 120/80 స్థాయిల కంటే ఎక్కువగా నమోదైతే దాన్ని అదుపులో పెట్టుకోవాల్సిందే. అందుకు జీవనశైలి, ఆహారంలో మార్పులు, ఒత్తిళ్లను తగ్గించుకోవడం, వ్యాయామం, ప్రాణాయామం/యోగా వంటివి చేయించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఏది చేసినా ఔషధాలను కూడా క్రమం తప్పకుండా ఇప్పించాలి.

ప్రొస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ (పీఎస్ఏ)
రక్తంలో పీఎస్ఏ ఎంత ఉన్నది తెలుస్తుంది. పురుషులకు ప్రొస్టేట్ కేన్సర్ రిస్క్ ఎక్కువ. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ రిస్క్ అధికమవుతుంది. అందుకే 50 ఏళ్లు దాటిన నాన్నకు ఈ టెస్ట్ ఏటా చేయించాలి. ప్రొస్టేట్ టిష్యూ విడుదల చేసే ప్రొటీనే పీఎస్ఏ. దీని స్థాయులు పెరిగిపోతే ప్రొస్టేట్ కేన్సర్ గా అనుమానించి తదుపరి టెస్ట్ లను వైద్యులు సిఫారసు చేస్తారు. ముందస్తు గుర్తింపే కేన్సర్ నుంచి రక్షణ అని తెలిసిందే. 

కొలనోస్కోపీ
పాశ్చాత్య దేశాల్లో 50 ఏళ్లు దాటిన వారికి చేసే పరీక్ష ఇది. కొలన్ అంటే పెద్దపేగు. వంశంలో ఎవరికైనా కొలన్ కేన్సర్ ఉన్నా.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ తో బాధపడుతున్నా, జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు దీన్ని సిఫారసు చేస్తుంటారు. ఐదేళ్లకు ఒకసారి ఈ పరీక్ష చేయిస్తే చాలు.

  • Loading...

More Telugu News