RBI: రాత్రి పొద్దుపోయిన తర్వాత కాల్స్ చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా... కఠినచర్యలే!: రికవరీ ఏజెంట్లకు ఆర్బీఐ వార్నింగ్
- రికవరీ ఏజెంట్ల ఆగడాలపై దృష్టిసారించిన ఆర్బీఐ
- దురుసు ప్రవర్తన ఆమోదయోగ్యం కాదన్న శక్తికాంత దాస్
- ఫిర్యాదులపై విచారణ ఉంటుందని వెల్లడి
- బ్యాంకులు శ్రద్ధ చూపాలని హితవు
బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక రుణ సంస్థల నుంచి ప్రజలు రుణాలు తీసుకున్న తర్వాత, తిరిగి ఆ రుణాలు వసూలు చేసే క్రమంలో కొన్నిసార్లు రికవరీ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు అనేక దృష్టాంతాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దేశంలోని రికవరీ ఏజెంట్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా ఫోన్ కాల్స్ చేసి వేధించడం, తప్పుడు మాటలు మాట్లాడడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రికవరీ ఏజెంట్లకు హితవు పలికారు.
వేళకాని వేళల్లో, కొన్నిసార్లు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రివకరీ ఏజెంట్లు ఫోన్ చేయడంపైనా, అభ్యంతరకర భాష మాట్లాడడంపైనా తమకు ఫిర్యాదులు అందాయని అన్నారు. ఇలాంటి చర్యలతో ఆయా ఆర్థిక సంస్థలు తమ మనుగడకు తామే ముప్పు కొనితెచ్చుకున్నట్టు అవుతుందని స్పష్టం చేశారు. రికవరీ ఏజెంట్ల ఆగడాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హెచ్చరించారు.
ఫిర్యాదులు ఎదుర్కొనే ఆయా ఆర్థిక సంస్థలను సంబంధిత న్యాయ ప్రాధికార సంస్థల పరిధిలోకి తీసుకువచ్చి విచారణ చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. రికవరీ ఏజెంట్లపై తమకు అందే ఫిర్యాదులను న్యాయ ప్రాధికార సంస్థలకు బదలాయిస్తామని తెలిపారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని, కాబట్టి ఈ తరహా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరుతున్నామని వెల్లడించారు.