Arvind Kejriwal: అగ్నివీర్ లను బీజేపీ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డులుగా తీసుకుంటామన్న కైలాష్ వర్గీయ.. మండిపడిన అరవింద్ కేజ్రీవాల్
- అగ్నిపథ్ విధానం ప్రతిపాదించిన కేంద్రం
- దేశంలో పలుచోట్ల ఆగ్రహ జ్వాలలు
- బీజేపీ కార్యదర్శి వ్యాఖ్యలపై విమర్శలు
భారత త్రివిధ దళాల్లో నాలుగేళ్ల కాలావధితో అగ్నిపథ్ ఉద్యోగ నియామక విధానం రూపొందించడం తెలిసిందే. అయితే ఈ విధానంపై దేశంలో ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. నాలుగేళ్ల పాటు అగ్నివీరులుగా విధులు నిర్వర్తించిన తర్వాత వారి భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కేంద్రం అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆర్మీ ఆశావహుల్లో అభద్రతాభావం తొలగిపోవడంలేదు.
ఈ అంశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. నాలుగేళ్ల పాటు పనిచేసిన అగ్నివీరులను బీజేపీ కార్యాలయాల్లో సెక్యూరిటీ గార్డులుగా తీసుకుంటామని విజయవర్గీయ వ్యాఖ్యానించారు. బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులను నియమించేటప్పుడు మొదటి ప్రాధాన్యత ఈ అగ్నివీరులకే ఇస్తామని అన్నారు.
విజయ్ వర్గీయ వ్యాఖ్యలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. యువతను, ఆర్మీ సిబ్బందిని చులకన చేయొద్దని హితవు పలికారు. తమ జీవితకాలం పాటు సైన్యంలో పనిచేయాలన్న సంకల్పంతో వారు ఎంతో శ్రమించి ఫిజికల్ టెస్టులు పాస్ అవుతారని, ఎంతో కష్టపడి రాత పరీక్షలోనూ పాస్ అవుతారని కేజ్రీవాల్ వివరించారు. అంతేతప్ప, వారు కష్టపడేది బీజేపీ కార్యాలయాల వెలుపల గార్డుగా పనిచేసేందుకు కాదని స్పష్టం చేశారు.
అటు, కైలాష్ విజయ్ వర్గీయ వ్యాఖ్యల పట్ల సొంత పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ విమర్శించారు. "మహోన్నత భారత సైన్యంలో పనిచేసి వచ్చిన అగ్నివీరులను రాజకీయ పార్టీ ఎదుట కాపలాదారుగా నియమిస్తారా..? ఆ విధంగా నియమించే వ్యక్తికి శుభాకాంక్షలు చెబుతున్నా" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.