Pawan Kalyan: మాకు ప్రజలతోనే పొత్తు... ఇంకెవరితో లేదు: పవన్ కల్యాణ్
- పర్చూరులో జనసేన రచ్చబండ సభ
- కౌలు రైతులకు ఆర్థికసాయం
- వైసీపీపై నిప్పులు చెరిగిన పవన్ కల్యాణ్
- దసరా తర్వాత వైసీపీ నేతల అంతుచూస్తామని హెచ్చరిక
బాపట్ల జిల్లా పర్చూరులో జనసేనాని పవన్ కల్యాణ్ భారీ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పొత్తుల అంశాన్ని ప్రస్తావించారు. ఇది పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదని అన్నారు. తమకు ప్రజలతోనే పొత్తు అని... ఇంకెవరితోనూ లేదని స్పష్టం చేశారు.
తాను ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు కోరుకోవడంలేదని, ప్రజలు ప్రభుత్వాలను నిలదీసేలా తయారుచేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. 2009లో చెప్పినదానికే కట్టుబడి ఉన్నానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే రాజకీయాల నుంచి నిష్క్రమించేందుకు పార్టీ ఏర్పాటు చేయలేదని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో చాలాసార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారని, ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వండి అని విజ్ఞప్తి చేశారు. మన ఎంపీలు ఢిల్లీలో కూర్చుని వ్యాపారాలు చేసుకుంటుంటారని, అలాంటి వాళ్లు కాకుండా, బాధ్యత గల కొత్తతరం వ్యక్తులను ఎన్నుకుంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, ప్రతి ఒక్కరూ జనసేన వైపు దృష్టిసారించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
ఇక, వైసీపీ నేతలు ఏం మాట్లాడినా దసరా వరకు భరిస్తామని, ఆ తర్వాత వారి అంతు చూస్తామని హెచ్చరించారు.