Varla Ramaiah: నేటితో ముగుస్తున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ గడువు.. జగన్ పై వర్ల రామయ్య విమర్శలు!
- అనంతబాబును బెయిల్ పై తీసుకురావడానికి ప్రభుత్వం తంటాలు పడుతోందన్న వర్ల
- దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చి వారిని విస్మరించారని విమర్శ
- దళితులకు న్యాయం చేయాలని డిమాండ్
తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ నేటితో ముగుస్తోంది. గత నెల 23న అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. రిమాండ్ గడువు ముగియనుండటంతో ఆయనను ఈరోజు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. 'దళిత యువకుడిని దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును బెయిల్ పై బయటకు తీసుకురావాలని మీ ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది ముఖ్యమంత్రి గారూ' అని విమర్శించారు. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన మీరు ఈ వర్గాలను విస్మరించి... అనంతబాబు వైపు మొగ్గడం దళిత వ్యతిరేక చర్యేనని చెప్పారు. ఇప్పటికైనా దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.