Chandrababu: అయ్యన్న చేసింది కబ్జా కాదు.. ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల భూమిని ఆక్రమించుకోవడం కబ్జా: చంద్రబాబు
- అయ్యన్న ఇంటి గోడను కూల్చి అధికారులు తప్పు చేశారన్న బాబు
- కోర్టు ఆదేశాలను అతిక్రమించిన వాళ్లు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక
- నిలదీసే వారిని జగన్ వేధిస్తున్నారని విమర్శ
రాత్రిపూట కూల్చివేతలకు సంబంధించి ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్ ఏం సమాధానం చెపుతారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చి అధికారులు తప్పు చేశారని... ఆ అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చివేసిన నేపథ్యంలో ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. దీంతో, టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయ్యన్నపాత్రుడు చేసింది కబ్జా కాదని చంద్రబాబు అన్నారు. ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల భూమిని ఆక్రమించుకోవడం భూకబ్జా అని చెప్పారు. ప్రజల తరపున గళం వినిపిస్తున్న వారిపై తప్పడు కేసులు పెడుతున్నారని, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. నిలదీసే వారిని జగన్ వేధిస్తున్నారని చెప్పారు. జగన్ కక్ష సాధింపుల కోసం కోర్టు ఆదేశాలను అతిక్రమిస్తున్న వారందరూ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.