Asaduddin Owaisi: నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు తప్పో, ఒప్పో ప్రధాని మోదీ తన బాల్యమిత్రుడు అబ్బాస్ ను అడగాలి: ఒవైసీ
- ఇటీవల మోదీ తల్లి హీరాబెన్ పుట్టినరోజు
- బాల్యమిత్రుడు అబ్బాస్ ను గుర్తుచేసుకున్న మోదీ
- మోదీకి ఇలాంటి స్నేహితుడున్నాడని తెలియదన్న ఒవైసీ
బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దీనిపై స్పందించారు. నుపుర్ శర్మ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు తప్పో, ఒప్పో ప్రధాని నరేంద్ర మోదీ తన బాల్యమిత్రుడు అబ్బాస్ ను అడిగి తెలుసుకోవాలని పేర్కొన్నారు.
ఇటీవల తన తల్లి హీరాబెన్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ తన చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ గురించి ప్రస్తావించడం తెలిసిందే. తన తల్లి అబ్బాస్ ను కూడా తనతో పాటు సమానంగా చూసేదని మోదీ గొప్పగా చెప్పారు. ఈ నేపథ్యంలో, ఒవైసీ వ్యాఖ్యలు చేశారు.
"ఎనిమిదేళ్ల తర్వాత ప్రధాని మోదీ తన ఫ్రెండ్ ను గుర్తుచేసుకున్నారు. మీకు ఇటువంటి స్నేహితుడు ఉన్నాడని మాకు తెలియదు. మేం కోరేదేంటంటే... ఒకవేళ అబ్బాస్ అనే వ్యక్తి ఇంకా ఉంటే వెంటనే అతడికి కాల్ చేయండి. అసదుద్దీన్ ఒవైసీ, మతగురువుల ప్రసంగాలను వినమని చెప్పండి. మా ప్రసంగాల్లో ఏమైనా తప్పు ఉందా అని అతడిని అడగండి" అంటూ ఒవైసీ వివరించారు.
"ఒకవేళ మీరు గనుక అబ్బాస్ చిరునామా ఇస్తే నేను అతడి వద్దకు వెళతాను. నుపుర్ శర్మ వ్యాఖ్యలు అభ్యంతరకరమో, కాదో అతడ్నే అడుగుతాను. అతడు అభ్యంతరకరమేనని అంగీకరిస్తే, నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దారుణమైనవే అవుతాయి" అంటూ వ్యాఖ్యానించారు.