Revanth Reddy: ఐదు నిమిషాల సమయం కూడా లేదా?: కేటీఆర్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం
- బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారన్న రేవంత్
- అన్ని సమస్యలు పరిష్కరిస్తామని కేటీఆర్ ట్వీట్ చేసి ఐదు రోజులు గడుస్తోందని విమర్శ
- విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్న పీసీసీ అధ్యక్షుడు
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆందోళనలు చేస్తుంటే... సమస్యలను పరిష్కరించేందుకు మీకు ఐదు నిమిషాల సమయం కూడా లేదా? అని ప్రశ్నించారు. బాసర ట్రెపుల్ ఐటీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకుంటే... హైదరాబాద్ నుంచి బాసర వరకు పోలీసులతో అరెస్టులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ ట్వీట్ చేసి ఐదు రోజులు గడుస్తున్నా ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని... లేకపోతే నిరుద్యోగ గర్జన కంటే భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పక్షాన ఉద్యమిస్తుందని హెచ్చరించారు.