YSRCP: పారిస్ పర్యటనకు కోర్టు అనుమతి కోరిన జగన్... ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్
- పారిస్‌లో చదువుతున్న జగన్ కుమార్తె
- కూతురు కాలేజీ స్నాతకోత్సవానికి హాజరు కావాలని జగన్ భావన
- పారిస్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్
- పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన సీబీఐ అధికారులు
- జగన్ విదేశీ పర్యటనకు వెళితే కేసుల విచారణ జాప్యం అవుతుందని వ్యాఖ్య
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ తాజా విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై సోమవారం జరిగిన విచారణలో సీబీఐ ఆసక్తికర వాదనను వినిపించింది. జగన్ విదేశాలకు వెళ్తే... ఆయనపై నమోదైన కేసుల విచారణలో జాప్యం చోటుచేసుకుంటుందని వాదించింది. అంతేకాకుండా పలు కారణాలు చెబుతూ జగన్ విదేశీ పర్యటనలకు వెళుతున్నారని కూడా సీబీఐ వాదించింది. ఈ కారణంగా జగన్‌ను విదేశీ పర్యటనకు అనుమతించరాదంటూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.
జగన్ కుమార్తెల్లో ఒకరు పారిస్‌లో విద్యనభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆమె విద్యాభ్యాసం ముగియగా... ఆమె కళాశాలకు సంబంధించిన స్నాతకోత్సవం జులై 2న జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకే తాను పారిస్ వెళ్లాల్సి ఉందని చెప్పిన జగన్... అందుకు అనుమతించాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. దీనిపై సోమవారం నాటి విచారణ సందర్భంగా సీబీఐ కౌంటర్ దాఖల చేయగా... తదుపరి విచారణలో కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.