YSRCP: తెలుగు రాష్ట్రాల్లో పాస్‌పోర్టుల జారీలో తీవ్ర జాప్యం... విదేశాంగ మంత్రికి వైసీపీ ఎంపీ ఫిర్యాదు
- తత్కాల్ పథకంలో 3 రోజులకే పాస్‌పోర్టు రావాలన్న వైసీపీ ఎంపీ
- తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆరోపణ
- కరోనా కారణమని అధికారులు చెబుతున్నారన్న భరత్ రామ్
- సిబ్బందిని పెంచి సమస్యను పరిష్కరించాలని విదేశాంగ మంత్రికి సూచన
పాస్‌పోర్టుల జారీలో తీవ్ర జాప్యం... ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితిని వివరిస్తూ వైసీపీ యువ నేత, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ మంగళవారం విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ట్విట్టర్ ద్వారా విదేశాంగ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టుల జారీలో జాప్యానికి అసలు కారణాలను కూడా భరత్ రామ్ ప్రస్తావించారు.
తత్కాల్ పథకం కింద కేవలం 3 రోజుల్లో పాస్‌పోర్టులు జారీ కావాల్సి ఉందని, అదే సాధారణ పద్ధతుల్లో 15 రోజుల్లో పాస్‌పోర్టులు జారీ కావాల్సి ఉందని భరత్ రామ్ పేర్కొన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. కరోనా కారణంగా పాస్‌పోర్టుల జారీలో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్న మాట వాస్తవ విరుద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
పాస్‌పోర్టుల జారీలో జాప్యానికి సిబ్బంది కొరతే ప్రధాన కారణమని కూడా భరత్ రామ్ తెలిపారు. ఈ వ్యవహారంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ దృష్టి సారించాలని, తక్షణమే సమస్యను పరిష్కరించే దిశగా సిబ్బందిని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.