Pakistan: గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కబోతున్న పాకిస్థాన్ మేక పిల్ల
- 19 ఇంచుల పొడవైన చెవులతో పుట్టిన మేక పిల్ల
- సింబా అని పేరు పెట్టుకున్న యజమాని ముహమ్మద్
- పాకిస్థాన్ లో సెలబ్రిటీగా మారిపోయిన సింబా
పాకిస్థాన్ లోని కరాచీలో జన్మించిన ఒక మేక పిల్ల గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కబోతోంది. ఈ మేక పిల్లకు 19 ఇంచులు (46 సెంటీమీటర్లు) పొడవైన చెవులు ఉండటమే దీనికి కారణం. జూన్ 5న ఈ మేక పిల్ల జన్మించింది. మేక పిల్ల యజమాని ముహమ్మద్ హాసన్ దీనికి సింబా అనే పేరు పెట్టాడు. ఈ మేక పిల్ల పుట్టిన తర్వాత దీన్ని చూసిన వారందరూ నోరెళ్లబెట్టారు. కనీవినీ ఎరుగని రీతిలో దీని చెవులు ఉన్నాయి. అది నడుస్తుంటే దాని చెవులు నేలను తాకుతున్నాయి. దీంతో దీన్ని చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. రాత్రికి రాత్రే ఇది పాకిస్థాన్ లో ఒక సెలబ్రిటీ అయిపోయింది.
జన్యుపరమైన తేడాల వల్లే మేక పిల్ల చెవులు అంత పొడవుగా ఉండొచ్చని నిపుణులు చెపుతున్నారు. ఏదేమైనప్పటికీ పొడవైన చెవులతో ఈ మేక పిల్ల ఎంతో అందంగా, ప్రత్యేకమైన ఆకర్షణతో కనపడుతోంది. ఇప్పుడు గిన్నిస్ బుక్ లోకి కూడా ఎక్కబోతోంది.