Diet: వారానికి రెండు రోజులు పాటిస్తే చాలు.. ఊబకాయానికి చెక్, బీపీ, మధుమేహం కూడా నియంత్రణలోకి.. ఎలాగో తెలుసా?

Just weekly two days diet Best way to control your weight

  • మన సంప్రదాయం నుంచే సరికొత్త డైట్
  • వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటే చాలు
  • పలు ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి
  • మధుమేహం, రక్తపోటు కూడా నియంత్రణలోకి..

బరువు పెరుగుతున్నామన్న ఆందోళనతో ఎంతో మంది ఆహారం తినడం తగ్గించేస్తారు. తమకు ఇష్టమైన ఆహారాన్ని తినాలన్నా కూడా ఎంతో ఆలోచిస్తుంటారు. కానీ ఈ తంటాలేవీ లేకుండా.. ఇష్టమైనవన్నీ లాగించేస్తూ కూడా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు పరిశోధనలను క్రోడీకరించి ఒక నివేదికను తయారు చేశారు. ఇటీవలే న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్, క్లినికల్ న్యూట్రిషన్, అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్ తదితర జర్నళ్లలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.

వారానికి రెండు రోజుల ఉపవాసం
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు సూచిస్తున్న ఈ సరికొత్త డైట్ ఓ రకంగా మన సంప్రదాయ పద్ధతులను అనుసరించి ఉన్నదే. అదే ఉపవాసం. వారంలో ఐదు రోజుల పాటు మనకు ఇష్టమైన ఆహారం తిన్నా.. మిగతా రెండు రోజులు మాత్రం గట్టిగా ఉపవాసం చేయాలని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగని ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా.. కొన్ని నియమాలను సూచిస్తున్నారు.
  • ఐదు రోజుల పాటు ఇష్టం వచ్చిన  ఆహారం తినొచ్చని అంటే.. మరీ అతిగా తినడమని కాదు. సాధారణంగా 20 ఏళ్లు దాటినవారికి రోజుకు 2,500 కేలరీల వరకు శక్తి అవసరం. మనం ఏది తిన్నా.. ఈ కేలరీలను దాటిపోకుండా చూసుకోవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
  • మిగతా రెండు రోజుల ఉపవాసం సమయంలో.. మనం రోజూ తినే ఆహారంలో పావు వంతు మాత్రమే. అదీ కొద్దికొద్దిగా తీసుకోవాలి. అంటే 500-600 కేలరీల శక్తినిచ్చే మేర ఆహారం తీసుకుంటే చాలు.

ఉపవాసంలో ఏమేం తినాలి? 

5:2 డైట్ విధానాన్ని అనుసరించేవారు ఉపవాసం ఉండే రెండు రోజుల్లో సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం మంచిది.
  • అన్నానికి బదులు రాగి, జొన్న వాడొచ్చు. దాదాపు అన్ని రకాల కూరగాయలూ తీసుకోవచ్చు. వంటలో నూనె, ఉప్పు శాతం తగ్గించాలి.
  • మాంసాహారులైతే.. కొవ్వు పూర్తిగా తొలగించిన చికెన్, చేపలు వంటివాటిని ఓ మోస్తరుగా తీసుకోవచ్చు. 
  • అరటి, మామిడి పండు, యాపిల్స్ వంటివి కాకుండా.. స్ట్రాబెర్రీ, నారింజ, బ్లూబెర్రీస్, జామ వంటి పండ్లను తీసుకోవాలి.
  • చక్కెర లేకుండా గానీ, అతి తక్కువ చక్కెర వేసుకుని గానీ టీ, కాఫీ డికాక్షన్ తాగొచ్చు. ఇవి కొంత వరకు ఆకలిని నియంత్రిస్తాయి కూడా.
  • మంచి నీళ్లు తగినంతగా తాగడం మర్చిపోవద్దు.
  • బరువు తగ్గాలనుకునే ఎవరైనా ఈ డైట్ ను సులువుగా అనుసరించవచ్చు. దుష్పరిణామాలు కూడా పెద్దగా ఉండవు. మొదట్లో కొద్దిగా కష్టం అనిపించినా.. తర్వాత సులువుగానే అలవాటు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

క్రమంగా బరువు తగ్గుతారు
ఎవరైనా ఒక్కసారిగా బరువు తగ్గితే ఎన్నో దుష్పరిణామాలు తలెత్తుతాయని.. 5:2 డైట్ ను అనుసరిస్తే.. క్రమంగా, ఓ పద్ధతి ప్రకారం బరువు తగ్గుతారని వైద్య నిపుణులు అంటున్నారు.  
  • రెండు రోజుల ఉపవాసం సమయంలో మన శరీరం ‘కీటోసిస్' (శరీరంలోని కొవ్వును శక్తిగా మార్చుకోవడం) స్థితికి వెళుతుందని.. అందువల్ల అనవసర కొవ్వు తగ్గిపోతుందని ఇంగ్లండ్ కు చెందిన ప్రముఖ వైద్యుడు డానీ లీ తెలిపారు. 

రక్తంలో చక్కెరల నియంత్రణ.. మెదడుకూ  ఆరోగ్యం

ఈ సరికొత్త డైట్ వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ (రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని సమర్థవంతంగా నియంత్రించడం) పెరుగుతుందని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది రక్తపోటు (బీపీ)ను, కొలెస్టరాల్ ను నియంత్రణలో ఉంచేందుకు తోడ్పడుతుందని వివరిస్తున్నారు.
  • రక్తంలో చక్కెర శాతం సమస్థాయిలో ఉండటం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని వైద్యుల పరిశీలనలో వెల్లడైందని ఆబ్లె ఆరోగ్య శిక్షణ యాప్ డైరెక్టర్ కరోలిన్ నికోలాస్ తెలిపారు.
  • ఉపవాసం సమయంలో శరీరంలో దెబ్బతిన్న కణాల పునరుద్ధరణ వేగవంతం అవుతుందని.. ఇది శరీరం ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుందని నికోలాస్ వివరించారు.

  • Loading...

More Telugu News