Vijayakanth: కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే చీఫ్ విజయకాంత్ కుడి కాలి మూడువేళ్ల తొలగింపు
- గత కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్న ‘కెప్టెన్’
- కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో తొలగింపు
- సోషల్ మీడియా పుకార్లు నమ్మొద్దని అభిమానులకు పార్టీ విజ్ఞప్తి
కోలీవుడ్ సీనియర్ నటుడు, దేశీయ ముర్‌పొక్కు ద్రవిడ కళగమ్ (DMDK) అధ్యక్షుడు విజయకాంత్ కుడి కాలి మూడు వేళ్లను వైద్యులు తొలగించారు. మధుమేహంతో బాధపడుతున్న ‘కెప్టెన్’ కాలి వేళ్లకు రక్తం సరఫరా కాకపోవడంతో వైద్యులు అత్యవసరంగా ఆ వేళ్లను తొలగించినట్టు డీఎండీకే తెలిపింది.
ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని పార్టీ పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని, ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను పట్టించుకోవద్దని అభిమానులు, కార్యకర్తలను కోరింది. విషయం తెలిసిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తమిళ చిత్రసీమలోని ప్రముఖ నటుల్లో ఒకరైన విజయకాంత్ రాజకీయాల్లో అడుగుపెట్టి 2005లో పార్టీని స్థాపించారు. ప్రజల్లో ఆయన పార్టీకి ఆదరణ పెరిగింది. అయితే, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే పేలవ ప్రదర్శన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పార్టీ ప్రాముఖ్యత క్రమంగా తగ్గింది.
ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో గత కొంతకాలంగా అటు రాజకీయాల్లో కానీ, ఇటు సినిమాల్లో కానీ ఆయన చురుకైన పాత్ర పోషించడం లేదు. కొన్ని సందర్భాల్లో తప్పితే బహిరంగంగా కనిపించడం కూడా తగ్గించేశారు. ప్రస్తుతం ఆయన భార్య ప్రేమలత, బావమరిది సుధీష్‌లు పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు.