YSRCP: సీబీఐ విచారణకు సమయం కావాలన్న ఆమంచి... సరేనన్న కేంద్ర దర్యాప్తు సంస్థ
- సీబీఐ కేంద్ర కార్యాలయానికి సమాచారం పంపిన వైసీపీ నేత
- ఇతరత్రా కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందన్న ఆమంచి
- వారం గడువు ఇస్తే విచారణకు హాజరవుతానని విజ్ఞప్తి
న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యల కేసులో బుధవారం సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన వైసీపీ నేత, ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గైర్హాజరయ్యారు. ముందే నిర్ణయించుకున్న ప్రకారం పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందని, విచారణకు హాజరయ్యేందుకు తనకు సమయం కావాలని ఆమంచి సీబీఐ కేంద్ర కార్యాయానికి సమాచారం చేరవేశారు. వారం గడువు ఇస్తే విచారణకు రాగలనంటూ ఆయన తెలిపారు.
ఆమంచి విజ్ఞప్తికి ఓకే చెప్పిన సీబీఐ అధికారులు విచారణకు హాజరయ్యేందుకు ఆయనకు గడువు మంజూరు చేసినట్లు సమాచారం. జగన్ సర్కారు తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై ఏపీ హైకోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థను కించపరిచేలా వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలతో సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.