K A Paul: కేసీఆర్ ఫ్యామిలీ రూ.9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది.. దర్యాప్తు చేయాలంటూ సీబీఐకి కేఏ పాల్ ఫిర్యాదు
- ఢిల్లీలో సీబీఐ కార్యాలయానికి వెళ్లిన కేఏ పాల్
- సీబీఐ డైరెక్టర్‌తో అరగంట పాటు భేటీ
- కేసీఆర్ అవినీతిపై ఆధారాలు సమర్పించానన్న పాల్
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐ డైరెక్టర్ సుభోద్ జైస్వాల్‌కు ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో సీబీఐ కార్యాలయానికి వెళ్లిన పాల్... సీబీఐ డైరెక్టర్‌తో అర గంట పాటు భేటీ అయ్యారు.
అనంతరం కార్యాలయం బయటకు వచ్చిన కేఏ పాల్ అక్కడే మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం ఏకంగా రూ.9 లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన సమగ్ర ఆధారాలను సీబీఐ డైరెక్టర్‌కు అందజేశానని ఆయన తెలిపారు. తాను అందజేసిన ఆధారాలను పరిశీలిస్తామని, అవసరమనుకుంటే తనను సంప్రదిస్తామని సీబీఐ డైరెక్టర్ చెప్పినట్టు పాల్ వెల్లడించారు.