Telangana: జహీరాబాద్‌లో వెమ్ టెక్నాలజీస్‌కు భూమి పూజ చేసిన కేటీఆర్
- నిమ్జ్‌లో రూ.1,000 కోట్లతో వెమ్ టెక్నాలజీస్
- ఈ కంపెనీ ద్వారా 2 వేల మందికి ఉపాధి లభించే అవకాశం
- రక్షణ రంగ పరికరాల తయారీ, పరిశోధనే లక్ష్యంగా ప్లాంట్
తెలంగాణ పారిశ్రామిక యవనికలో మరో కీలక అడుగు పడింది. రక్షణ రంగ పరికరాల తయారీ, పరిశోధనల సంస్థ వెమ్ టెక్నాలజీస్ తన ప్లాంట్ నిర్మాణాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిధిలోని ఎల్గోయిలో ఏర్పాటు కానున్న నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ మాన్యూఫ్యాక్ఛరింగ్ జోన్ (నిమ్జ్)లో ఈ కంపెనీ ప్లాంట్‌కు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు.
వెమ్ టెక్నాలజీస్‌తో ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోగా... బుధవారం ఆ కంపెనీ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ ప్లాంట్ కోసం వెమ్ టెక్నాలజీస్ రూ.1,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. ఐదేళ్ల కాలంలో ఈ కంపెనీ ద్వారా రాష్ట్రంలోని 2 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రక్షణ రంగ పరికరాల తయారీ, పరిశోధనలో వెమ్ టెక్నాలజీస్ పనిచేయనుంది.