indian Airports: ప్రపంచంలో అత్యుత్తమ 100 విమానాశ్రయాల్లో మనవి నాలుగు!
- ప్రయాణికులు ఇచ్చిన రేటింగ్ ఆధారంగా ఎంపిక చేసిన స్కైట్రాక్స్ సంస్థ
- తొలి స్థానంలో దోహాలోని హమాద్ ఎయిర్ పోర్టు
- 37వ స్థానంలో నిలిచిన ఢిల్లీ,
- జాబితాలో బెంగళూరు (61), హైదరాబాద్ (63), ముంబై (65)
ప్రపంచంలోని టాప్–100 అత్యుత్తమ విమానాశ్రయాల్లో మన దేశానికి చెందిన నాలుగు ఎయిర్ పోర్టులు నిలిచాయి. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాలకు ఈ జాబితాలో స్థానం దక్కింది. ప్రఖ్యాత స్కైట్రాక్స్ సంస్థ 2021–22 సంవత్సరానికిగాను ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులను సర్వే చేసి ‘వరల్డ్ ఎయిర్ పోర్ట్ సర్వే’ పేరిట నివేదికను విడుదల చేసింది. అందుబాటులో ఉన్న ఉత్తమ సదుపాయాలు, సమర్థవంతమైన నిర్వహణ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని.. అత్యుత్తమ 100 విమానాశ్రయాలకు ర్యాంకులను కేటాయించింది.
మన దేశ ఎయిర్ పోర్టుల ర్యాంకులివీ..
అత్యుత్తమ 100 ఎయిర్ పోర్టుల్లో ఢిల్లీ విమానాశ్రయం 37వ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఢిల్లీకి 45వ ర్యాంకు రావడం గమనార్హం. ఇక గత ఏడాది 71వ స్థానంలో ఉన్న బెంగళూరు ఈసారి 61వ స్థానానికి ఎగబాకింది. హైదరాబాద్ కూడా 64వ స్థానం నుంచి ఈసారి 63వ స్థానానికి చేరగా.. ముంబై గత ఏడాది, ఈసారి కూడా 65వ స్థానంలో నిలిచింది.
- అమెరికాలోని లాస్ ఏంజిలిస్ (76వ ర్యాంకు), న్యూయార్క్ జేఎఫ్ కే (85) , లండన్లోని గట్విక్ (69వ ర్యాంకు), చైనాలోని బీజింగ్ (84), వంటి ఎయిర్ పోర్టులు కూడా మన దేశ విమానాశ్రయాల కంటే వెనుకబడి ఉండటం గమనార్హం
- ప్రపంచంలో దోహాలోని హమాద్ ఎయిర్ పోర్టు, టోక్యోలోని హనెడా, సింగపూర్ లోని చంగి విమానాశ్రయాలు ప్రపంచంలో టాప్ మూడు స్థానాల్లో నిలిచాయి.