fertility: సంతాన సాఫల్యత పెంచుకునే మార్గాలు..!
- మద్యం, పొగాకు రెండూ పెద్ద ప్రతిబంధకాలు
- వీర్యం నాణ్యత, కణాల సంఖ్య, వాటి కదలికలు కీలకం
- ఒత్తిళ్లు తగ్గించుకోవాలి
- బరువు నియంత్రణలో ఉండాలి
పెళ్లయిన దంపతులకు వారసులు ఓ కల. సంతానం కోసం వారు ఎంతో పరితపిస్తుంటారు. కొంచెం ఆలస్యం అయినా తమలో ఏదో లోపం ఉందేమోనని, తమకు సంతాన భాగ్యం ఉంటుందా? ఉండదా? అన్న సందేహాలతో ప్రశాంతతను కోల్పోతుంటారు.
కడుపు పండాలంటే భార్యా, భర్త ఇద్దరి పాత్ర కీలకమే. ముఖ్యంగా పురుషుల్లో వీర్య కణాలు తగినన్ని ఉండాలి. ఆ వీర్య కణాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలి. అప్పుడే త్వరగా గర్భధారణ జరుగుతుంది. వీర్యకణాలు తక్కువగా ఉన్నా, ఆరోగ్యకరంగా లేకపోయినా సాధారణ గర్భధారణ కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. దీనికితోడు జన్యుపరమైన అంశాలు, ఫలదీకరణకు వీలుగా పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు ఎలా ఉందన్నదీ కీలకం అవుతుంది.
పొగతాగడం, మద్యపానం చేటే..
పొగతాగడం, అధికంగా మద్యాన్ని సేవించడం ఈ రెండూ వీర్యం నాణ్యతను దెబ్బతీసే అంశాలు. సంతాన సాఫల్యత అవకాశాలపై వీటి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. రెగ్యులర్ గా ఆల్కహాల్ తాగే వారిలో టెస్టోస్టెరోన్ హార్మోన్ స్థాయులు తగ్గిపోతాయి. దీంతో అంగం స్తంభన సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. వీర్యం ఉత్పత్తి కూడా తగ్గుతుంది. పొగాకు వీర్యం సాంద్రతను తగ్గిస్తుంది. అలాగే, పొగాకు వల్ల వీర్య కణాల చలనశీలత, డీఎన్ ఏ కూడా దెబ్బతింటాయి. కనుక సంతానం ప్రాప్తించే వరకైనా వీటిని పూర్తిగా దూరం పెట్టడం ఎంతో అవసరం.
ఒత్తిళ్లు..
ఒత్తిళ్లు పెరిగిపోవడం కూడా నష్టమే. ముఖ్యంగా సంతానోత్పత్తికి ఒత్తిళ్లు పెద్ద ప్రతిబంధకంగా చూడాలి. అంగస్తంభన లేకపోవడం, లైంగిక వాంఛ తగ్గడం, వీర్య కణాలు తక్కువగా ఉండడం ఇవన్నీ ఒత్తిళ్ల వల్లే. పిల్లలు కావాలన్న కోరికకు అవరోధాలుగా నిలుస్తాయి. సంతానం కల నెరవేరని దంపతులు ముందుగా తాము ఒత్తిడిలో ఉన్నామా? అన్నది పరిశీలించుకోవాలి. ప్రాణాయామం, యోగ, నడక ఇవన్నీ కూడా ఒత్తిళ్లకు మంచి వ్యాయామాలు.
బరువు
శరీర బరువు నియంత్రణలో ఉంచుకోవడం కూడా సంతానం ఆశించే వారికి అవసరం. బాడీమాస్ ఇండెక్స్ సాధారణ స్థాయిలో ఉండడం వల్ల సంతాన సాఫల్యత అవకాశాలు పెరుగుతాయి. వీర్యకణాల కదలిక చురుగ్గా ఉంటుంది.
వ్యాయామం
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా అవసరం. దీనివల్ల పునరుత్పత్తి సామర్థ్యం పెరగడమే కాకుండా.. జీవనశైలి వ్యాధులను దూరంగా పెట్టుకోవచ్చు.
ఇక వీటితోపాటు.. వేడినీళ్ల స్నానానికి దూరంగా ఉండాలి. ఒడిలో ల్యాప్ ట్యాప్ పెట్టుకుని పనిచేయడం మానుకోవాలి. అండర్ వేర్ లూజ్ గా ఉండేలా చూసుకోవాలి. బిగుతైన ప్యాంట్లను ధరించొద్దు. ఆచరణలో ఈ జాగ్రత్తలు అన్నీ పాటించినా, సంతానం కలగకపోతే వైద్యులను ఒకసారి సంప్రదించి సమస్యలు ఉన్నాయేమో కనుక్కోవాలి.